పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం.. ఉద్యోగం దొరకకపోవడం.. ప్రేమ విఫలం.. తల్లిదండ్రులు మందలించడం.. ఇలా ఎన్నో రకాల కారణాలతో మనస్తాపం చెంది బతుకు భారమనుకుని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న వాళ్లెందరో. ఇలాంటి వారికి జీవితంపై ఆశ కల్పించడం కోసం స్పందన-ఎద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ సదస్సు ఏర్పాటు చేశారు.
'ఆత్మహత్యల నివారణ- జీవితం చాలా విలువైనది' అనే అంశంపై హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో ఎంతో మంది తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. షీటీమ్స్ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్పందన ఎద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సామెల్ రెడ్డి కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన తర్వాత.. తన కూతురులా ఇంకెవరూ తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించకూడదని ఆయన పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి మహమూద్ తెలిపారు. పరోక్షంగా ఇప్పటివరకు వేల మందిలో ఆత్మస్థైర్యం నింపి.. ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
- ఇదీ చదవండి : దాంపూర్లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి