ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని భావించిన ఎస్ఈసీ.. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలోనూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని పేర్కొంది.
పెద్దిరెడ్డి ఏమన్నారంటే...
‘‘తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాట విన్నా... మేము అధికారంలో ఉన్నన్ని రోజులూ మిమ్మల్ని బ్లాక్‌లిస్టులో పెడతాం’’ అని జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘మీ అందరికీ మీడియా ముఖంగా చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి. ఏ అధికారి అయినా ఎస్‌ఈసీ మాటలు వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అని అనుకుంటే గుణపాఠం తప్పదు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. చిత్తూరు, గుంటూరులో ఏకగ్రీవాలను ఆపమని ఆయన(నిమ్మగడ్డ) అంటున్నారు. మీరు ఆయన మాట వినకుండా ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని సూచిస్తున్నా. ఇవ్వకపోతే... పేరు పేరునా గుర్తు పెట్టుకొని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఏ అధికారి కూడా నిమ్మగడ్డను గౌరవించి పని చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మార్చి 31 వరకే ఎస్‌ఈసీగా ఉంటారు. అంతవరకూ మేము ఏమీ మాట్లాడదలచుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో వైకాపా అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ప్రజలందరూ ఏ వైపు ఉన్నారని గుర్తించకుండా ఏకగ్రీవాలను ఆపాలనే అధికారం నీకెక్కడిది’ అని ఎస్‌ఈసీని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్