రాష్ట్రంలో పురపోరుకు నగారా మోగింది. రాష్ట్రంలో నగరపాలక, పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, పాల్వంచ, మణుగూరు, మందమర్రి, నకిరేకల్, సిద్దిపేట, జహీరాబాద్, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలు మినహా... 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇవాళ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ జారీ జనవరి 7(ఎన్నికల సంఘం)
జనవరి 8(రిటర్నింగ్ అధికారులు)
నామినేషన్ల స్వీకరణ జనవరి 8 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలన జనవరి 11
అప్పీళ్లకు గడువు జనవరి 12
అప్పీళ్ల పరిష్కారానికి గడువు జనవరి 13
నామినేషన్ల ఉపసంహరణ జనవరి 14 సాయంత్రం 3 గంటల వరకు
తుదిజాబబితా ప్రకటన జనవరి 14 సాయంత్రం
పోలింగ్ జనవరి 22
రీపోలింగ్(అవసరమైతే) జనవరి 24
లెక్కింపు జనవరి 25
వార్డుల వారీగా ఈ నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు. ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను వచ్చే నెల 2 వరకు స్వీకరిస్తారు. ఈ నెల 31న మున్సిపాలిటీ, జనవరి 1న కార్పొరేషన్ల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 4న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. జనవరి 5, 6 తేదీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
120 మున్సిపాల్టీల్లోని 2,727 కౌన్సిలర్, 10 కార్పొరేషన్లలోని 385 కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో అత్యధికంగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్ నగరపాలికల్లో 60 డివిజన్లు ఉండగా... బండ్లగూడ జాగీర్‌లో అత్యల్పంగా 22 స్థానాలున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ పురపాలికల్లో అత్యధికంగా 49 వార్డులు ఉండగా... అమరచింత, ఆత్మకూర్, అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్, చండూర్‌లో అత్యల్పంగా 10 స్థానాలున్నాయి.
ఇదీ చూడండి: హేమంత్ సోరెన్‌కు కేసీఆర్,కేటీఆర్ శుభాకాంక్షలు