ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా భారతీయ స్టేట్ బ్యాంక్ పని చేస్తున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా స్పష్టం చేశారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకే కాకుండా పెద్ద ఎత్తున సూక్ష్మ రుణాలను ఇచ్చి చిన్న చిన్న వ్యాపారులను ప్రోత్సహించి బ్యాంకు వ్యాపార సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. పలువురు బ్యాంక్ అధికారులతో కలిసి మంగళవారం సైబరాబాద్లో కొత్త పరిపాలన కార్యాలయాన్ని మిశ్రా ప్రారంభించారు.
రాష్ట్రంలో 1,170 ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల బ్యాంకర్ల పనితీరు మెరుగుపడి ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రతి 200 బ్రాంచ్లకు ఒక పరిపాలన కార్యాలయం ఉండేట్లు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్, నల్గొండ, వరంగల్, సికింద్రాబాద్లో నాలుగు ప్రాంతీయ పరిపాలన కార్యాలయాలు ఉన్నాయి. తాజాగా సైబరాబాద్ పరిపాలన కార్యాలయం అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
మరో ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో నిజామాబాద్లో ప్రారంభించనున్నట్లు మిశ్రా తెలిపారు. సైబరాబాద్ పరిపాలన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా దాని పరిధిలోకి 180 బ్రాంచీలు వస్తాయని, ఈ కార్యాలయం పరిధిలో రూ.56 వేల కోట్లు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: School fees : వచ్చే సంవత్సరమూ పాత ఫీజులే!