ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ అదిత్యనాథ్ దాస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా ఉద్యోగ విరమణ చేస్తున్న అదిత్యనాథ్ దాస్‌ను సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులు, అధికారులు సన్మానించారు. ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ కావడం లేదని, ఆయన దిల్లీకి వెళ్తున్నారని నూతన సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఆయన దిల్లీలో ఉండి ఏపీకి మరింత సేవలందిస్తారన్నారు. తన సర్వీసులో చాలా మంది అధికారులతో పని చేసిన అనుభవం ఉందని నూతన సీఎస్ సమీర్ శర్మ అన్నారు.
ఆ రోజు కారు డ్రైవర్ ప్రాణాలు కాపాడారు...
ప్రభుత్వ సర్వీసులో చేరాక ప్రతీ పనిని బృందంగా చేయడం నేర్చుకున్నానని..ప్రతి రోజును ఉద్యోగంలో చేరిన తొలి రోజుగానే భావిస్తానని ఏపీ తాజా మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. కలెక్టర్‌గా వరంగల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు తన మీద కాల్పులు జరిపారన్న ఆయన... ఆ రోజు కారు డ్రైవర్.. తన ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. సెక్రటేరియట్లో విధుల నిర్వహణ, అక్కడ తీసుకునే నిర్ణయాలపై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఏపీ అభివృద్ధి కోసం అవసరమైన పనులన్నీ దిల్లీలో ఉండి నెరవేర్చే ప్రయత్నం చేస్తానని ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. సలహాదారు పదవిలో దిల్లీకి వెళ్తున్నా.. అధికారులకు సహకారం అందించి ఏపీని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి: Revanth reddy: 'అందరి పేర్లు డైరీలో రాసుకుంటాం.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం'