sale of ink pens: రాజమండ్రి రత్నం పెన్నులన్నా తెనాలి ప్రసాద్ పెన్నులన్నా నాటికాలంలో తెలియనివారుండరు. బంగారు వర్ణంలో మెరిసే క్యాప్ ఉండే ఇంకు పెన్ను.... ఖద్దరు చొక్క జేబుకు పెట్టుకుంటే ఆ గౌరవమే వేరు. అలాంటి ఇంకుపెన్నులు కాలక్రమంలో కనుమరుగైనా....నేటికీ వాటి ఉనికి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ గుంటూరుకు చెందిన రెనార్స్ పెన్స్ దుకాణం యజమాని వెంకట నారాయణమూర్తి. స్వాతంత్య్రం రాక ముందు నుంచి నేటి వరకు వినియోగంలో ఉన్న ఇంకు పెన్నుల్లో ఇక్కడ దొరకనిదంటూ ఉండదు. అరుదైన, విలువైన అధునాతన పెన్నులే కాదు... ఒకప్పుడు ట్రెండీగా ఉన్నవాటినీ భద్రపరుస్తున్నారు. పాడైపోయిన ఇంకుపెన్నులకు ఉచితంగా మరమ్మతులు చేస్తున్నారు.
నారాయణమూర్తి దుకాణంలో నాటితరం ఇంకుపెన్నులతోపాటు విదేశాలకు చెందిన అత్యంత ఖరీదైన పెన్నులు సైతం దొరుకుతాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు బంగారం, వెండి, ఇత్తడితో సైతం పాలీలు తయారు చేసి ఇస్తున్నారు. సిరా సైతం 30 రంగుల్లో లభ్యమవుతుంది. ఇంకు పెన్నులపై ఉన్న మమకారం, ఇష్టంతోనే పాతతరం పెన్నులకు ఉచితంగా మరమ్మతులు చేసి ఇస్తామంటున్నారు వెంకటనారాయణమూర్తి.
ఇప్పటితరం వారు కూడా చాలా మంది ఇంకుపెన్నులు వాడేందుకు ఇష్టపడటం శుభపరిణామని వెంకటనారాయణమూర్తి అంటున్నారు. కొత్త పరిజ్ఞానంతో ఇంకుపెన్నులను సైతం ఈకాలానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. పెన్నులంటే ఇష్టమున్న ఎంతోమంది ఈ దుకాణానికి వచ్చి తమ అభిరుచికి తగిన పెన్నులు సేకరిస్తున్నారు.
కలానికి విలువ పెంచడం కోసం బంగారంతో, వెండితో పెన్నులు తయారు చేస్తున్నాం. భిన్నమైన ఆకారాలు అభిరచుల ప్రకారం పెన్నుల తయారి. పాడైపోయిన ఇంకుపెన్నులకు ఉచితంగా మరమ్మతులు చేస్తాం. ఇప్పటితరం వారు కూడా చాలా మంది ఇంకుపెన్నులు వాడేందుకు ఇష్టపడటం శుభపరిణామం. - వెంకట నారాయణమూర్తి రెనార్స్ పెన్స్ దుకాణం యజమాని
ఇదీ చదవండి: మోదీజీ సిలిండర్ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో: సబితా ఇంద్రారెడ్డి