హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ పర్వతాపూర్ సాయిప్రియ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ముప్పై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ ఇంటి స్థలాలను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఆరోపించారు. భాజపా నేతలతో కలిసి మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
సర్వే నంబర్ 1 నుంచి 21 వరకు ఉన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేస్తే... ఇప్పుడు సీలింగ్ అంటూ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాలు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వ స్థలాలుగా ఎలా మారుతాయని ప్రశ్నించారు. తెరాస నేతలు తమ స్థలాలను కాపాడుకోవటం కోసం, స్థిరాస్తి వ్యాపారం కోసం పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.