ఆటోల్లో కిక్కిరిసి వద్దు:
ఆటోల్లో నిబంధనల ప్రకారం డ్రైవర్‌తో కలిసి ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు. అయితే కొందరు ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. ఇందులో చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు. శివారు ప్రాంతాల్లో తిరుగుతున్న సెవెన్ సీటర్ ఆటోలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కిస్తే ఎవరికివారు చొరవ తీసుకొని ఆటో దిగిపోవడమే మేలు.
రోడ్లపై ఉమ్మడం మానండి:
వైరస్ ప్రధానంగా నోటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. చాలామంది లెక్క చేయకుండా రోడ్లపై ఉమ్మి వేస్తున్నారు. ఇటువంటివారికి జరిమానా విధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మాస్క్‌తో రక్ష:
కరోనాతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వస్తుంది. ఇది ఉపరితలంపై పడుతుంది. కొంత సమయం గాలిలో ఉంటుంది. ఈ క్రమంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చినవారికి వ్యాపించే ప్రమాదం ఉంది. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
గుంపుల్లోకి వద్దే వద్దు:
ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో ఆదివారం వస్తే వేలమంది గుమిగూడటం చూస్తున్నాం. ఇక్కడనే కాదు అనేక స్థానిక మార్కెట్లలో ఇదే పరిస్థితి. విచ్చలవిడిగా వేలల్లో సంచరించడం మానాలి. జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
పని ఉంటేనే బయటకు..
సమయం దొరికిందా కదా అలా బయట తిరిగి వద్దామనే ధోరణి సరికాదు. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప వెళ్లడం తగ్గించాలి. లేదంటే మీ ద్వారా ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇంట్లోకి వెళ్లే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
అప్రమత్తంగా ఉండాలి
ప్రతి ఒక్కరూ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంచాలకుడు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఐఐసీటీలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిశోధనలు, ప్రస్తుత కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఆన్‌లైన్ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వంద కరోనా రోగుల నుంచి అంతకంటే తక్కువ మందికే వైరస్ సోకితే కొద్ది నెలల్లోనే మన దేశానికి కరోనా నుంచి విముక్తి లభిస్తుందన్నారు.