Revanthreddy Comments: సీఎం కేసీఆర్ మరొసారి నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే ఈ మోసపూరిత ప్రకటన చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేవాలయంగా భావించే అసెంబ్లీపై విశ్వాసం సన్నగిల్లితే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితర ముఖ్య నాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సుదీర్ఘంగా చర్చించారు.
దరఖాస్తు రుసుం తీసుకోకూడదు..
సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 24 గంటలు గడిచినా.. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదని.. ఆర్థిక ఆమోదం పొందినట్లు ఎలాంటి ఆదేశాలు లేవని ఆరోపించారు. రిక్రూట్ మెంట్ బోర్డులకు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలు లేవన్న రేవంత్.. టీఎస్పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చి ఉంటే తెలంగాణ సమాజానికి చూపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల నుంచి దరఖాస్తు ఫీజుల కింద 12వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దరఖాస్తు రుసుం రూపాయి కూడా తీసుకోకూడదని.. నిరుద్యోగులకు శిక్షణా తరగతులు, వసతి సౌకర్యం ప్రభుత్వమే ఉచితంగా కల్పించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రజల తీర్పుగా గౌరవిస్తామన్న రేవంత్ రెడ్డి.. ఆ ఫలితాలు తెలంగాణపై ఏలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. తాము ఓడిపోయిన మాట నిజమేనన్న రేవంత్.. భాజపాకు కూడా ఉత్తరప్రదేశ్‌లో సీట్లు తగ్గాయన్నారు.
లక్ష ఉద్యోగాలు మింగేశారు..
"టీఎస్పీఎస్సీ రికార్డుల ఆధారంగా రాష్ట్రంలో 36 వేల ఉద్యోగాలే భర్తీ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత నెలకు వెయ్యి మంది లెక్కన 90 వేలకుపైగా ఉద్యోగులు పదవీవిరమణ చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక లక్షా 91వేలకుపైగా ఖాళీలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇందులో లక్ష ఉద్యోగాలను కేసీఆర్ మింగేశారు. లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్న సీఎం కేసీఆర్.. ఇందుకు సంబంధించి శాఖల వారీగా, సంవత్సరాల వారీగా భర్తీ చేసిన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. 91వేలు ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏడువేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నట్లు చెప్పడం చూస్తే.. కేసీఆర్ నైజం తెలుస్తోంది. ఎనిమిదేళ్లలో 1.30 లక్షల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు మిగిలిపోయాయి. ప్రతి నిరుద్యోగికి లక్షా 25వేలు నిరుద్యోగ భృతి బకాయి పడ్డారు."
-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ప్రజల తీర్పును గౌరవిస్తాం.
రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రజల తీర్పుగా గౌరవిస్తామన్నపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఆ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. తాము ఓడిపోయిన మాట నిజమేనన్నఆయన.. భాజపాకు కూడా ఉత్తరప్రదేశ్‌లో సీట్లు తగ్గాయని రేవంత్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వ్యక్తులకే మూడు రోజులు కార్యక్రమం చేస్తారని.. కాని కేటీఆర్ బతికున్న వ్యక్తి కేసీఆర్‌కు మూడు రోజులు పుట్టిన రోజులు వేడుకలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పిండం పెట్టాలని తాము పిలుపునివ్వడంపై తప్పుబడుతున్న కేటీఆర్.. గతంలో తమ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావుడప్పు కొట్టినప్పుడు ఈ తెలివి ఎక్కడ పోయిందని నిలదీశారు.
ఇదీ చూడండి: