Revanth reddy on Liquor Scam: భారత్ జోడో యాత్ర ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా దేశ సమగ్రతను కాపాడటం కోసమే నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్నామనే తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయన్న రేవంత్.. జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. దేశ ప్రజలపై భాజపా దాడి చేస్తోందని మండిపడ్డారు. జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతుందని వెల్లడించారు.
లిక్కర్ స్కాంలో కవిత ఉన్నారని భాజపా నేతలే చెబుతున్నారని.. ఆధారాలు దొరకాలంటే ప్రగతిభవన్‌లో సోదాలు జరగాలన్నారు. ప్రగతిభవన్ మాఫియాకు అడ్డాగా మారిందని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేజ్రీవాల్‌ను దిల్లీలో సీఎం కేసీఆర్ కలిశారని.. లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని ఆరోపించారు. ఆయన్ను సీబీఐ ప్రశ్నించాలన్నారు.
'భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదు. దేశప్రజల స్వేచ్ఛ కోసమే రాహుల్‌గాంధీ యాత్ర చేపట్టారు. దేశ సమైక్యతను కాపాడాటానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది. మోదీ, అమిత్‌షా... సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని చూసి భయపడుతున్నారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల్ని భయపెట్టి ఆధిపత్యం చెలాయించాలని భాజపా చూస్తోంది. లిక్కర్ స్కాంలో కవిత ఉన్నారని భాజపా నేతలు చెప్తున్నారు. ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్‌లో సోదాలు జరగాలి. మాఫియాకు అడ్డా ప్రగతి భవన్. ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై సీబీఐ విచారణ జరగాలి. లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్. సీఎం కేసీఆర్‌ని సీబీఐ ప్రశ్నించాలి.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: