కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన రేవంత్.. వైద్యశాలంతా కలియ తిరిగారు. అందులో ఒక్క డాక్టర్ కాని, ఒక్క రోగికాని లేరని.. ఆస్పత్రి అంతా చెత్తతో నిండిపోయిందని ధ్వజమెత్తారు. నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఓ కుక్క తప్ప మరెవ్వరు లేరని ఆరోపించారు. ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ వంద మంది వైద్యులు ఉంటారని, 15వందల పడకల ఆస్పత్రి అని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిదున్నర లక్షలు కరోనా పరీక్షలు చేస్తే... తెలంగాణలో మాత్రం కేవలం యాభైవేలు పరీక్షలు చేశారని ఆరోపించారు. అత్యధిక పరీక్షల విషయంలో 22వ స్థానంలో ఉండగా.. మరణాల రేటులో మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ముందుందన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేవలం దిష్టిబొమ్మ లాంటి వ్యక్తని.. ఆయనకు ఏలాంటి అధికారాలు లేవని ఎద్దేవా చేశారు. టిమ్స్‌లో మురికినీటి వ్యవస్థ సక్రమంగా లేకపోతే... తాను ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ మొద్దు నిద్ర వీడి టిమ్స్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తద్వారా గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల సంఖ్య తగ్గుతుందని, వైద్యులపై ఒత్తిడి ఉండదని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు