తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే లిక్కర్ ఓపెన్ చేశారో.. అప్పుడే ప్రజల్లో కరోనా అంటే భయం పోయిందని ఎంపీ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాజాగా కరోనా కేసులు పెరగడానికి వైన్స్ షాపులే కారణమని విమర్శించారు. మద్యం దుకాణాల ముందు వందల మంది క్యూకడితే రాని కరోనా.. ఒక్కరిద్దరు పనిచేసుకునే మెకానిక్ షాప్స్ దగ్గర ఎలా వస్తుందని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల నష్టాన్ని భరించి వ్యాపారస్తులు ప్రభుత్వానికి సహకరిస్తే.. మద్యం దుకాణాలను తెరవడం ద్వారా సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు.
45 రోజుల వ్రతం కేసీఆర్ లిక్కర్ షాప్స్ తెరవడంతో ఆగమాగమైందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి లిక్కర్ ప్రాధాన్యత అయినప్పుడు చిరు వ్యాపారికి వాళ్ల వ్యాపారం ప్రాధాన్యత కాదా అని నిలదీశారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, అహ్మదాబాద్‌ల్లో ఎక్కువగా కేసులు పెరగడానికి కారణం నమస్తే ట్రంప్ మీటింగ్ అని ఆరోపించారు.
మర్కజ్ కి వెళ్లింది 10వేల మంది మాత్రమేనని.. నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైంది లక్షల మందని గుర్తుచేశారు. పర్యాటక ప్రాంతమైన గోవాలో కేసులు లేవు, కానీ గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఉండేదని.. ఇప్పుడు అధికార పార్టీ నేతలు తప్ప ఎవ్వరికి అవకాశం రావడం లేదన్నారు.
ఇవీ చూడండి: అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న 118 మంది