టెండర్ ఓట్లు దాఖలైన మూడు చోట్ల రేపు రీపోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్ నగర్, కామారెడ్డి, బోధన్ పురపాలికల పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడం వల్ల ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22న జరిగిన పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. రేపు అక్కడ రీపోలింగ్ జరగనుంది.
మహబూబ్ నగర్ 41వ వార్డులోని 198వ పోలింగ్ కేంద్రంలో, కామారెడ్డి 41వ వార్డులోని 101, బోధన్ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రాల్లో రేపు పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు 25న చేపడతారు. నిజాంపేటలోనూ టెండర్ ఓటు తరహాలోనే ఒక ఓటు పడ్డప్పటికీ దాన్ని పూర్తిగా టెండర్ ఓటుగా పరిగణించలేమని అధికారులు తెలిపారు. అక్కడ రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ ఓటును ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇవీ చూడండి: ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక