పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఎలాంటి ఉపద్రవాలకు అవకాశం లేని భౌగోళిక పరిస్థితులు.. కాస్మోపాలిటన్ సంస్కృతి.. ప్రపంచ పేరెన్నిక గల సంస్థలు కొలువుదీరడం.. మెరుగైన ఉపాధి అవకాశాలు.. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్, టీఎస్‌ఐసాస్, టౌన్‌షిప్, లాజిస్టిక్ పాలసీలు.. ఇలా అనేక అంశాలు భాగ్యనగరంలో రియల్ రంగాన్ని(Real Estate) పరుగులు పెట్టిస్తున్నాయి.
ఐటీ ఉత్పత్తుల్లో దిగ్గజం.. ఫార్మా రంగంలో రారాజు.. విద్య, వైద్య, శాస్త్ర పరిశోధన రంగాలకు రాజధాని.. ఇవన్నీ హైదరాబాద్ మహానగరానికి వన్నెతెచ్చాయి. విశ్వఖ్యాతిని ఆపాదించాయి. నివాసయోగ్యమైన నగరంగా అంతర్జాతీయ స్థాయిలో కొంతకాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కోటి దాటిన జనాభా రాబోయే పదేళ్లల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ అవసరాలకు అనుగుణంగా నగరం విస్తరిస్తోంది. ప్రభుత్వం కూడా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు, పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తోంది. నగరం నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆ ప్రాంతాలతో అనుసంధానం చేస్తోంది. ఇవన్నీ శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగేందుకు కారణం అయ్యాయి.
ఐటీ కారిడార్‌లోని చాలా ప్రాంతాల్లో ఎకరం ధర రూ.50 కోట్ల వరకు పలుకుతోంది. వేలంలో మరింత ఎక్కువ ధరకే భూములను రియల్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. అక్కడి లేఅవుట్‌లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించి ఇవ్వడం, క్లియర్ టైటిల్, టీఎస్‌బీపాస్‌తో 21 రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉండటంతో వెంటనే నిర్మాణాలు చేపట్టాలనుకునే వారికి ఇదో అవకాశంగా వేలంలో భూములు దక్కించుకున్నారని క్రెడాయ్ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తగ్గితే మున్ముందు కార్యాలయాల భవనాలకు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉండటంతో ఇక్కడ భూములు కొన్నట్లు చెబుతున్నారు.
మౌలిక వసతులతో..
నగరానికి ఔటర్ రింగురోడ్డు ఒక తలమానికం అయితే.. రీజనల్ రింగురోడ్డు రియల్ హారంలా మారింది. ఇక్కడ పట్టణీకరణకు హద్దులు లేని ప్రాంతం అవ్వడంతో.. ఎక్కడ ఇల్లు కట్టినా రూ.లక్షలు, కోట్లు పలుకుతుందనే ధీమా నగరంవైపు రియల్ రంగాన్ని అడుగులు వేసేదిగా చేసింది. నివాస అవసరాలు ఆకాశమే హద్దుగా మారుతుంటే.. రియల్ రంగం(Real Estate) అంతే స్థాయిలో ఎదుగుతోంది.
హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలతో ప్రవాస భారతీయులు, వేర్వేరు నగరాల నుంచి ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయ దిగుబడి పెరిగి ఆదాయాలు పెరగడంతో ఇందులో మిగులు రాబడి రియల్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారని.. ఇది కూడా రియల్ దూకుడుకి కారణమని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు విశ్లేషించారు. కొవిడ్ సమయంలో సొంత ఇంటి అవసరాన్ని గుర్తించి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ పెరిగిందని చెప్పారు. వ్యవసాయ రంగం బాగుండటం, ఐటీ రంగంలో 12 శాతం వృద్ధి, పారిశ్రామిక రంగంలో వృద్ధితో హైదరాబాద్ వృద్ధిపై విశ్వాసంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మరో 9 నుంచి పదేళ్ల వరకు హైదరాబాద్ వృద్ధికి ఢోకా లేదనే నమ్మకంతో ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయని విశ్లేషించారు.