Ratha Saptami celebrations: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని జయంతోత్సవ వేడుక మొదలైంది. అర్ధరాత్రి నుంచే వైభోగంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన.. ఈసారి తొలి పూజ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం, విశాఖ ఐజీ రంగారావు.. స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం ఏడు గంటల వరకు స్వామి వారి మూలవిరాట్టుకు క్షీరాభిషేకం జరగుతోంది. అనంతరం సూర్యనారాయణ స్వామి వారు నిజరూప దర్శనంతో భక్తులకు సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పుష్పాలంకరణ సేవ, సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ గావించి... పవలింపు సేవతో ఉత్సవం ముగిస్తోంది.
తెలుగు రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాలు నుంచి భక్తులు రావడం అనవాయితీ. భక్తుల కోసం క్యూలైన్‌లో ప్రత్యేక దర్శనం టిక్కట్లు అందుబాటులో ఉంచారు. సర్వదర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీ అమిత్‌బర్దార్ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.
ఇదీ చదవండి: మణికొండ జాగీర్‌లో 1,654 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీం