వర్షాకాలం మొదలైంది. చిన్నపాటి వానకే రహదారులపై వరద పారుతోంది. ఇళ్లు, ఇతర భవనాలపై పడిన నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఇంటి అవసరాల కోసం ఇప్పుడూ కొందరు నీటి ట్యాంకులు తెప్పించుకుంటున్నారు.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చేస్తే.. ఏడాది పొడవునా నీటికొరత ఉండదంటున్నారు వాననీటి సంరక్షకులు.
నగరంలో వార్షిక సగటు వర్షపాతం 820 మి.మీ. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య వానాకాలంలో 45-50 రోజుల పాటు వర్షాలు కురుస్తుంటాయి. గత ఏడాది 870 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నీటిలో అధికం మూసీపాలైంది. పెరుగుతున్న జనాభా వల్ల నీటి వినియోగం పెరిగి, భూగర్భజల మట్టాలు ఏటేటా పడిపోతున్నాయి. 1000-1500 అడుగుల లోతు వరకు బోర్లు వేసి నీటిని వాడుకుంటున్నారు. వేసవికి ముందే చాలా బోర్లు ఎండిపోతున్నాయి. 2011లో భూగర్భనీటి మట్టాలు 5.5 మీటర్ల లోతున ఉంటే.. 2016 నాటికి 12.5 మీటర్ల లోతునకు పడిపోయాయి.
30 శాతం ఇంకేలా చేసినా...
- నగరంలో వాననీటిని 30 శాతం భూమిలోకి ఇంకేలా చేసినా భూగర్భజలాలు పెరుగుతాయి. నీటి ఎద్దడిని తగ్గిస్తాయి.
- పైకప్పు నుంచి వచ్చే వాననీరు ఇంకేలా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వించాలి.
- పాడైన బోరును ఇంజెక్షన్ వెల్‌గా ఉపయోగించుకొని నీరు ఇంకేలా చేయొచ్ఛు
- చాలా చోట్ల ఇంకుడుగుంతల్లో పూడిక చేరింది. వర్షాలు కురుస్తుండడంతో పూడిక తొలగించాల్సి ఉంది.
ఇలా చేసుకోవచ్చు
- వర్షాకాలంలో ఇంటి పైకప్పు శుభ్రం చేసుకుని వాననీటిని పైపుల ద్వారా సంపులోకి మళ్లించవచ్ఛు ఫిల్టర్లు, ఇతర పద్ధతుల్లో శుభ్రం చేసి వాడుకోవచ్ఛు
- వాననీటి నీటి నిల్వకు పెద్ద సంపులు ఉంటే మేలు. 30వేల లీటర్ల నీరు పట్టే సంప్ ఉంటే వర్షపు నీరు ఇందులోకి చేరడానికంటే ముందే 8x4x3 అంగుళాల పరిమాణంలో రెండు ఛాంబర్లలో నీటి వడపోతకు ఏర్పాటు చేసుకోవాలి.
- మొదటి ఛాంబర్‌లో అడుగు భాగంలో బొగ్గు వేయాలి. దీనికి నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. బొగ్గుపై స్టీల్ మెష్ కప్పి పైన ఇసుకవేసి.. ఆపై కొంత ఖాళీ స్థలం వదిలేయాలి. ఇంటిపై కురిసిన వర్షం పైపుల ద్వారా మొదటి ఛాంబర్‌లో పడుతుంది. ఇక్కడి నుంచి రెండో ఛాంబర్‌లోకి చేరుతుంది. ఇందులో 50 శాతం బొగ్గుతో నింపి ఉంటుంది. ఇక్కడి నుంచి నీరు ట్యాంకులోకి చేరుతుంది. ట్యాంకులోకి చేరే దగ్గర గొట్టానికి వస్త్రం కడితే ఫిల్టర్‌లా పనిచేస్తుంది.
సంపుల్లోకి వెళ్లేలా..
- ఇంకుడు గుంత తవ్వేంత జాగాలు లేని ఇళ్ల వారు వాననీటిని శుభ్రం చేసి ట్యాంకుల్లో నిల్వ చేసుకోవడం మేలు. బోర్లు లేనివారు, ఉన్నా ఎండిపోయినవారు, సంపుల్లోకి వాననీటిని మళ్లించుకోవాలి.
- వాననీరు ఇంకేందుకు నగరంలో అవకాశాలు ఏటా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 38 శాతంగా ఉన్న ఖాళీ భూములు 2 శాతానికి పడిపోయాయి. నిర్మాణాలు 10-44 శాతానికి పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వాననీటి నిల్వనే పరిష్కారం.
- సాధారణ వర్షం పడితే 25x40 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవన పైకప్పుపై గంటలో సగటున 600 గ్యాలన్ల నీరు చేరుతుంది.
- వెయ్యి చ.అ. విస్తీర్ణం కలిగిన ఇంటిపైన 70-80 వేల లీటర్ల వర్షపు నీటి లభ్యత ఉంటుంది. దీన్ని ఒడిసి పడితే ట్యాంకర్లతో, బోర్‌వెల్స్‌తో పనే ఉండదు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!