Rains In Ap: ఆంధ్రప్రదేశ్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ చాలాచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరంతో పాటు పలు పట్టాణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కొన్నిచోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పట్టణాల్లో రహదారులు జలమయమయ్యాయి. అక్కడక్కడా వాగులు పొంగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, అమరావతి, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట తదితర మండలాల్లో కల్వర్టులపై వర్షం నీరు ప్రవహించింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10గంటల మధ్య అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో 102.75 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా జూపూడిలో 88, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 61.25 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
చెరువు కాదు..పొలాలే!: కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పొలాలు నీట మునిగి అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అష్టకష్టాలు పడి ఇటీవలే నాట్లు వేయగా శుక్రవారం కురిసిన వర్షాలకు పూర్తిగా మునిగాయి. సాగునీటి కాల్వలతో పాటు మురుగు కాల్వలు నిర్వహణకు నోచుకోక మాగాణులు ముంపు బారిన పడ్డాయి. సాధారణంగా ఏటా వేసవిలో కాలువల్లోని తూడు, గుర్రపు డెక్క, పూడిక తొలగిస్తారు. రెండేళ్లుగా నిర్వహణ లేక కాల్వలు పూర్తిగా మేట వేశాయి. నీరు బయటకు వెళ్లే మార్గం లేక పొలాలు వర్షార్పణమయ్యాయి.
మరో రెండు రోజులు..: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వచ్చే రెండో రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
ఇదీ చదవండి: