Rahul Gandhi to meet congress leaders: రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ సాయంత్రం 4 గంటలకు దిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతోపాటు సీనియర్లు, మాజీ మంత్రులు దాదాపు 50 మంది కలవనున్నారు. ఇప్పటికే కొందరు నేతలు దిల్లీకి చేరుకోగా, ఇవాళ ఉదయం మరికొందరు నేతలు హస్తిన వెళ్లనున్నారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమాన ప్రయాణం చెయ్యరు. అందువల్ల ఆయన కుటుంబ సమేతంగా నిన్ననే రైలులో బయలుదేరి దిల్లీ వెళ్లారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్సులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్లు.. పీసీసీ నిర్దేశించిన నేతలకు ఫోన్ చేసి రాహుల్ గాంధీతో భేటీకి రావాలని కోరారు. కొందరికైతే మాణిక్కం ఠాగూర్ లేఖలు కూడా రాశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు, వివిధ విభాగాల ఛైర్మన్లు.. రాహుల్ గాంధీని కలువనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, తెరాస, భాజపాలతోపాటు ఇతర పార్టీల బలాబలాలనూ అడిగి తెలుసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు, చేయాల్సిన కార్యక్రమాలపై సమీక్ష చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమైన అంశాలపై రాహుల్ గాంధీతో సమావేశం జరగనున్నందున.. పార్టీకి చెందిన ముఖ్యమైన, సీనియర్ నేతలతోపాటు, మాజీ మంత్రులు తప్పనిసరిగా ఉండేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పీసీసీ నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలుగుతాయని భావిస్తున్నారు.