రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని జగన్, కేసీఆర్లకు ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. నవ సూచనల పేరిట ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మరో లేఖ రాశారు. నదీ జలాలపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్.. జలవివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు.
తెలంగాణలో ఉండే ఆంధ్రావారి గురించే ఆలోచిస్తున్నానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి లేఖలు రాయటం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు తెలియంది కాదని చెప్పారు. తక్షణం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలు పరిష్కరించాలని రఘురామ కోరారు.
తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారని.. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల గురించి ఆలోచించే.. తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి అని ప్రశ్నించారు. తాజాగా కేఆర్ఎంబీ, ప్రధానికి జగన్ లేఖలు రాశారు. జలవివాదాలపై జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇవీచూడండి: Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు'