తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు.
ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 11 గంటల నుంచి 12 వరకు గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు.. ప్రస్తుతం హనుమంత వాహనంపై ఉరేగుతున్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై విహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
పోటెత్తిన భక్తులు...
ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.
ఇదీ చదవండి: రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం