ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లను రెన్యువల్ చేసి.. 14 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. వీవీలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ.. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు.
మెండి వైఖరి ప్రదర్శిస్తున్నారు
విద్యావాలంటీర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లకుండా విద్యాశాఖ అధికారులు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 2 లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులకు నెలకు రెండు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లుగానే... 16 వేల మంది వీవీలకు కూడా సర్కారు సాయం అందించాలని డిమాండ్ చేశారు.
14 నెలలుగా జీతాల్లేవ్
రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న విద్యావాలంటీర్లకు ప్రభుత్వం 14 నెలలుగా జీతాలు చెల్లించలేదని కృష్ణయ్య తెలిపారు. ఇప్పటికైనా వారి కష్టాలను ముఖ్యమంత్రి గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కారణంగా వీవీలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని... వారిలో కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని... లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విడతల వారీగా బడులు.. విద్యాశాఖ సమాలోచనలు.!