రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలోనే ఉందని... ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్ 1శాతంగా, యాక్టివ్ కేసుల రేట్ 3.4శాతంగా ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు వారంపాటు ఐసోలేషన్లో ఉండాలని కోరారు. కేసుల పెరుగుదల వారం తర్వాతే తెలుస్తుందని వివరించారు.
రాష్ట్రంలో మరో 50 కరోనా పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్టు వెల్లడించారు. 300 మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్లలో కొవిడ్ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు 104 ద్వారా తెలుపుతామన్నారు. పరీక్షల వివరాల కోసం 040 2465 1119 నెంబర్ను సంప్రదించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 135 మంది కొవిడ్ రోగులు చికిత్స తీసుకుంటున్నట్టు డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. పీహెచ్సీ స్థాయి నుంచి ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ప్రజల సహకారంతో సెకండ్ వేవ్ రాకుండా నియంత్రించగలమని ధీమా వ్యక్తం చేశారు. 2,3 నెలల క్రితం కొవిడ్ సోకినవారికి ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తున్నాయని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధుల్లో పోస్ట్ కొవిడ్ సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. బాధితులు ఏడాది పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం: హరీశ్