New Districts in AP : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సకల సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరేచోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు, సాధారణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. ప్రస్తుత కడప జిల్లాలో.. రాజంపేటను కాదని రాయచోటిని జిల్లాకేంద్రం చేయడంపై అక్కడి నాయకులు పార్టీలకు అతీతంగా మండిపడ్డారు. పురపాలక సంఘ కార్యవర్గం మొత్తం రాజీనామాకు సిద్ధపడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లాకేంద్రంగా చేయకుండా రాయచోటిలో కలపడమేంటని ఆ ప్రాంతంలో నిరసన మంటలు చెలరేగాయి.
విజయవాడలోనే ఉన్నాం.. ఉంటాం..
New Districts Issue in AP : విజయవాడలో కలిసిపోయిన పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో కలపడంపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోటను విజయనగరంలో కలపడం, నర్సీపట్నాన్ని చేయకపోవడంపై ఆయా ప్రాంతాల్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అధికారపక్ష ప్రజాప్రతినిధులు సైతం ఈ రెండింటి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజన ప్రభావం విశాఖపట్నం నగర పరిధిలోని పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలపై ఎక్కువగానే కనిపిస్తోంది. తిరుపతి కేంద్రంగా తలపెట్టిన జిల్లాకు శ్రీబాలాజీ కాకుండా తిరుపతిగానే పేరు ఉంచాలన్న డిమాండు ఉంది. దగ్గర్లో ఉన్న ఒంగోలును కాదని.. అద్దంకి నియోజకవర్గాన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలపడాన్ని అక్కడి వైకాపా నేతలు వ్యతిరేకించారు. శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్నే కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండుచేశారు. ‘ఎన్టీఆర్’ జిల్లాను స్వాగతిస్తున్నట్లు ఎన్టీ రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమన్నారు.
మార్కాపురం జిల్లాకు డిమాండ్లు
AP New Districts Issue : ప్రజల డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం కోసమే పాలనా కేంద్రాల వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. తేలిగ్గా వెళ్లగలిగేలా, దగ్గరగా ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామంటున్నా అక్కడి ప్రజలు జిల్లా కేంద్రం ఒంగోలు వెళ్లాలంటే సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రాకపోకలకే 8 గంటలకు పైగా పడుతోంది. లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాల ఏర్పాటు అనే అంశానికి చాలాచోట్ల మినహాయింపులు ఇచ్చినా.. జిల్లా కేంద్రానికి సరిపడా జనాభా, విస్తీర్ణం, అన్ని రకాల అనుకూలతలున్న పశ్చిమ ప్రాంతాన్ని విస్మరించారనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీ జిల్లాల్లో మూడు, నాలుగు శాసనసభ నియోజకవర్గాలతో జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ప్రకాశం జిల్లాలో పూర్తిగా వెనకబడిన పశ్చిమ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించి మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నిస్తున్నారు. వెనకబాటే ప్రామాణికం అనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల కంటే వెనుకబడ్డాం.. దూరాభారం తీసుకున్నా జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నాలుగైదు గంటలు పడుతుంది.. దశాబ్దాలుగా కరవులోనే బతుకుతున్నాం.. మరెందుకు మాకు ప్రత్యేక జిల్లా ఇవ్వరనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రస్తుత జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే తెల్లవారుజామున మొదటి బస్సెక్కితే పని పూర్తయి తిరిగివచ్చేసరికి ఏ అర్ధరాత్రో దాటుతుంది. ఒక మనిషి జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే రూ.500 కావాలి.
మార్కాపురం జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం - పి.వి.కృష్ణారావు, మార్కాపురం జిల్లా సాధన ఐక్యవేదిక సభ్యుడు
మార్కాపురం ప్రాంత ప్రజలు పూర్తిగా వెనుకబాటుకు గురవుతున్నారు. ఒక్క పరిశ్రమ కూడా లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కాపురం జిల్లా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తాం.
డిమాండు: మార్కాపురం కేంద్రంగా జిల్లా
నియోజకవర్గాలు: 5 యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం
విస్తీర్ణం : 11,500 చ.కి.మీ
జనాభా : 14.23 లక్షలు
ప్రయోజనం: ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పాటు చేస్తే.. వెనకబడిన ప్రాంతమైన ఈ అయిదు నియోజకవర్గాల అభివృద్ధిపైనే అధికారులు దృష్టి పెట్టే వీలుంటుంది. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి.
నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి..
Protest Over News Districts in AP : జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జునకు లేఖలు అందజేశారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు నర్సీపట్నం కేంద్రంగానే పాలించారని, అల్లూరి సీతారామరాజు పోరాట స్మృతులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయని లేఖల్లో ప్రస్తావించారు. ఇక్కడున్న వసతులు, భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు నర్సీపట్నం అందుబాటును వివరించారు.
నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.
రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుచేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణదొర, మొడియం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అద్దంకిని ప్రకాశంలోనే కొనసాగించాలి
'అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని వైకాపా అద్దంకి నియోజకవర్గ కన్వీనర్, శాప్ నెట్ ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్య కోరారు. దగ్గరలో ఉన్న ఒంగోలును కాదని వంద కి.మీ.దూరంలోని బాపట్లలో కలపడాన్ని నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సాంకేతికంగా కుదరని పక్షంలో స్థానికంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్ తదితరులకు సమస్యను వివరించనున్నట్లు తెలిపారు.'
- శాప్ నెట్ ఛైర్మన్ కృష్ణచైతన్య
కోనసీమ జిల్లాగా ప్రకటించిన అమలాపురం డివిజన్‌కు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు.
ఉదయగిరి జిల్లా సాధిద్దాం
నెల్లూరు జిల్లా ఉదయగిరిని జిల్లా కేంద్రం చేయాలనే ఎజెండాతో మేధావులు, నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా ఉద్యమించాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు డాక్టరు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడలిలో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా సాధన సమితి నాయకులు డి.రమేష్, చంద్రశేర్‌రెడ్డి, తెదేపా, భాజపా మండల కన్వీనర్లు, విశాంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో వెనకబడిన ఆదోని ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాయలసీమ సమన్వయ కమిటీ, సీమ విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గం తిరుపతి తుడా పరిధిలో ఉందని గుర్తుచేశారు.
ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలపాలి
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలంటూ వైకాపా నేతలు, ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. వైకాపా నాయకులు గొర్లె రవికుమార్, పినిశెట్టి వెంకటరమణ, ఎల్.కోట ఎంపీపీ శ్రీను, డీసీసీబీ ఛైర్మన్ చినరామునాయుడు, జడ్పీటీసీ సభ్యుడు అప్పారావు, ఎస్.కోట సర్పంచి సంతోషికుమారిలు ఎస్.కోటలోని దేవిగుడి కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ అన్నారు. పట్టణంతోపాటు, వేపాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్‌తో వేపాడ భాజపా మండలాధ్యక్షుడు గోకేడ మహేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.
మదనపల్లె కేంద్రంగా ప్రకటించాలి
మదనపల్లె జిల్లా ఆకాంక్ష బలంగా ప్రభుత్వానికి చేరాలంటే పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రోడ్డుపైకి రావాలని అఖిలపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జిల్లా సాధన ఐకాస అధ్యక్షుడు బందెల గౌతంకుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేలోపు చేయాల్సిన ఆందోళనల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. భారతీయ అంబేడ్కర్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లెను నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.షాజహాన్‌బాషా మాట్లాడుతూ అన్ని వనరులున్న మదనపల్లెను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం అశాస్త్రీయమన్నారు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్ మాట్లాడుతూ గతంలోనే మదనపల్లె జిల్లా కోసం 590 రోజులు ఉద్యమించారని, ఇప్పుడు రాయచోటిని జిల్లాగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధనకు ఈ ప్రాంత వైకాపా నాయకులు కలసి రావాలన్నారు. జనసేన నాయకుడు జంగాల శివరాం, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేంద్రబాబుమాదిగ, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్, సీపీఐ నాయకులు టి.కృష్ణప్ప, దివాకర్, ఆర్.మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మదనపల్లె కేంద్రంగా జిడ్డు కృష్ణమూర్తి జిల్లాగా గానీ, ఇక్కడ విద్యాభివృద్ధికి బీజం వేసిన అనీబీసెంట్ పేరుతోగానీ జిల్లాను ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.భాస్కర్ తదితరులు డిమాండ్ చేశారు.
స్థానిక చిత్తూరు బస్టాండు కూడలిలో మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ ప్రతులను మంటల్లో తగులబెట్టి నిరసన తెలిపారు.
శ్రీబాలాజీ జిల్లాపై స్థానికుల అభ్యంతరం
జిల్లాల పునర్విభజనలో.. చిత్తూరు జిల్లా విషయమై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న తిరుపతికి శ్రీబాలాజీ పేరు పెట్టడం, మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై ఆందోళన చేస్తున్నారు. ప్రపంచ ప్రాశస్త్యం కలిగిన తిరుపతి పేరు మార్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. తిరుమలకు తిరుపతికి అనుబంధం ఉందని, అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)గా పిలుస్తుంటారని చెబుతున్నారు. అలాంటిది తిరుపతికి శ్రీబాలాజీ జిల్లాగా పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీబాలాజీ అనే పేరు ఇక్కడి వారికి అలవాటు లేదని, తొలి నుంచి తిరుపతిగానే ప్రశస్తి చెందిందని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు తిరుమలకు వచ్చినా తాము తిరుపతికి వెళ్లామనే చెబుతారని, అందువల్ల అదే పేరును జిల్లా కేంద్రానికి కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నగరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉన్నందున దాన్ని ఈ జిల్లాలో ఉండేలా మార్చాలని అక్కడి తెదేపా నాయకులు కోరుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటుచేస్తామని చెప్పి, ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చారని తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని విమర్శించారు. తిరుపతి జిల్లా అనే పేరే సరైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాలాజీ అన్న పదం ఉత్తరాదివారే వాడుతారన్నారు. తిరుపతి పేరుతోనే జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తే మంచిదన్నారు. తిరుపతి పేరు ఒక చరిత్ర అని.. తిరుమల, తిరుపతి కవలల్లాంటివని తిరుపతి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కిరణ్‌రాయల్ పేర్కొన్నారు. బాలాజీ జిల్లాగా పేరు మార్చడం బాధ కలిగిస్తోందన్నారు. చరిత్రను చెరపవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవేంకటేశ్వర జిల్లా, శ్రీవారి జిల్లాగా పేరు పెట్టాలని స్థానికులు కొందరు కోరుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!