Civil Supplies: తెలంగాణ పౌరసరఫరాల సంస్థలో అక్రమార్కులపై వేటు కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పౌరసరఫరాల సంస్థ పెద్దపల్లి జిల్లా మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా మెదక్ జిల్లా మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారిని మాతృశాఖకు సరెండర్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మిల్లర్లతో క్షేత్రస్థాయి అధికారులు కుమ్మక్కై లక్ష్యానికి మించి మిల్లర్ల నుంచి బియ్యం సేకరించారు. ఇలా సుమారు 73 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా తీసుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 350 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఈ వ్యవహారంపై జులై 30న ఈటీవీ భారత్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వరంగల్ జిల్లా మేనేజర్‌ను కలెక్టర్ గడిచిన వారంలో సస్పెండ్ చేయటం సంచలనం అయింది. ఆపై పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ ఆయా అధికారులను పిలిపించి అదనంగా తీసుకున్న బియ్యాన్ని మిల్లర్లు వెనక్కు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పెద్దగా స్పందన లేకపోవటంతో తాజాగా మరో ఇద్దరు అధికారులపై వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గోదాములకు రాకుండానే.. మెదక్‌తోపాటు కొన్ని జిల్లాల్లో బియ్యం ప్రభుత్వ గోదాములకు రాకుండానే నేరుగా చౌకధరల దుకాణాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా మిల్లుల నుంచి బియ్యాన్ని ఆయా జిల్లాల్లోని గోదాములకు తరలిస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలిస్తారు. మిల్లర్లతో క్షేత్రస్థాయి అధికారులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుతో ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఉన్నత స్థాయిలో విచారణ నిర్వహిస్తే రాష్ట్రంలో గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్న అక్రమాల బాగోతం మరింతగా వెలుగులోకి వస్తుందన్న ప్రచారం సాగుతోంది.