ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో విమాన మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ సంచాలకులు ఎస్.సురేష్ ధ్రువీకరించారు. మరమ్మతుల కేంద్రం నెలకొల్పడానికి అవసరమైన స్థలం కూడా అందుబాటులో ఉన్నట్లు ఆయన ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు తెలిపారు.
ప్రస్తుతం దేశీయ విమానాలు మరమ్మతుల కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నాయి. దీంతో ఆర్థిక భారంతో పాటు సమయం వృథా అవుతోంది. దేశీయంగానే మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో తిరుపతితో పాటు మరో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఏఏఐ అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చే పక్షంలో తిరుపతి విమానాశ్రయానికి మరింతగా పేరు ప్రఖ్యాతులు దక్కే అవకాశం ఉంది. త్వరలోనే కార్గో విమానాలు నడిపేందుకు వీలుగా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. ఇక్కడ రన్‌వే విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భవిష్యత్‌లో మరింతగా సేవలు అందించే దిశగా విమానాశ్రయం సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: 'కరోనా సోకిందని కుటుంబంతో సహా వెలివేశారు'