లాక్డౌన్ నిబంధనలు, పర్యాటకంపై ఆంక్షల అమలు... వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. లాక్డౌన్ సడలించినా... క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ లేక, సరైన వ్యాపారం జరగక చిరు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు హామీతో కూడిన రుణాలను మంజూరు చేసిన కేంద్రం... ఇప్పడు వీధి వ్యాపారుల జీవనోపాధికి లబ్ధి చేకూరేలా పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధిని అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా రోడ్డు పక్కన వ్యాపారం చేస్తూ పొట్ట పోసుకునే వీధి వ్యాపారులకు ఈ స్వనిధి పథకం ద్వారా పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.
నేరుగా ఖాతాల్లోకే..
ఈ పథకాన్ని మొదటి దశలో 108 నగరాల్లో అమలు చేయనున్నారు. వీధి వ్యాపారుల రుణ దరఖాస్తుల పరిశీలన, లోన్ మొత్తాన్ని వారి ఖాతాల్లోకి సత్వరం జమచేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సైతం ప్రారంభించింది. ఇప్పటి వరకు పీఎం స్వనిధికి లక్షన్నర వరకు దరఖాస్తులు వరకు రాగా... 50 వేల వరకు అనుమతులు పొందాయని కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఏడాది గడువు ఉన్న లోన్‌ను సకాలంలో చెల్లించిన వారికి అదనపు లోన్ సౌకర్యం సైతం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది.
ఇదే జీవనోపాధి
హైదరాబాద్‌లోని కోఠి, అబిడ్స్, అమీర్‌పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారాలపైనే ఎక్కువమంది జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో చాలా మందికి ఈ రుణ సదుపాయంపై అవగాహన లేకపోగా... తెలిసిన వారు రుణ సదుపాయం పొందటం ఎలా అని మథనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదుకునేందుకు చొరవ చూపాలని స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్లు కోరుతున్నాయి. వీధి వ్యాపారులందరూ లోన్ సౌకర్యం పొందేలా అవగాహన, దరఖాస్తులు సత్వర పరిశీలన జరిగేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అసంఘటిత రంగంగా ఉన్న వీధి వ్యాపారులను ఏకతాటిపైకి తెస్తేనే ప్రభుత్వ ఫలాలు అందుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది చదవండి: 'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'