AP Minister Appalaraju : ఏపీ మంత్రి అప్పలరాజు తిరుమలకు వెళ్లారు. మంత్రి వెంట అనుచరులు భారీగా తరలివెళ్లారు. అయితే తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని తితిదేపై మంత్రి అప్పలరాజు ఒత్తిడి చేశారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన తితిదే అధికారులు... అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్ దర్శనం కల్పించారు. దీంతో తితిదే తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని... సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదని చెప్పారు.
"నా నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చా. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నా. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదు."- ఏపీ మంత్రి అప్పలరాజు