ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తొలి గంటలో అందించే చికిత్స అతి కీలకమైంది. సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే సత్వర సాయం అందకపోవడం వల్ల రోడ్డు ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతున్నారు.
28 ట్రామా కేర్ సెంటర్లు.. రూ.20 కోట్ల వ్యయం
తెలంగాణ ప్రభుత్వం క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించేందుకు... 28 ట్రామా కేర్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.20 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. కొన్నింటిని వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేయనుండగా.. మరికొన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోంది.
ప్రతిపాదనలు సిద్ధం
వైద్య కళాశాలల్లో నిపుణుల కొరత ఎదురయ్యే అవకాశాలు తక్కువే కాబట్టి.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో నెలకొల్పనున్న ట్రామా కేర్ సెంటర్లలో మాత్రం తప్పనిసరిగా ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, అనస్థీషియా విభాగాలకు చెందిన వైద్యనిపుణులు కనీసం ఒక్కొక్కరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకోనుంది. సంబంధిత ప్రతిపాదనలను వైదారోగ్యశాఖ తాజాగా రూపొందించింది.
కొత్త ట్రామా కేర్ కేంద్రాలు
- రాజీవ్ రహదారిపై: గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్
- నాగ్‌పూర్ రహదారిపై: తూప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్
- విజయవాడ వైపు: చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట, కోదాడ
- బెంగళూరు రహదారిపై: మహబూబ్‌నగర్, గద్వాల్
- వరంగల్ రహదారిపై: బీబీనగర్ (ఎయిమ్స్), జనగామ, కాకతీయ వైద్యకళాశాల, ములుగు
ఇతర చోట్ల: ఖమ్మం, కొత్తగూడెం, మిర్యాలగూడ, జగిత్యాల, హుజూరాబాద్, మహబూబాబాద్, సంగారెడ్డి, తాండూరు