వరుస దెబ్బలతో కకావికలమవుతున్న కోళ్ల పరిశ్రమ... ఇప్పుడు క్రమంగా పుంజుకుంటోంది. కొవిడ్, బర్డ్‌ఫ్లూ వదంతులతో భారీగా నష్టపోయిన ఫౌల్ట్రీ రంగం... జవసత్వాలు కూడగట్టుకుని మళ్లీ గాడిలో పడింది. కోళ్ల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకదని అధ్యయనాలు వెలువడుతున్నా.... కేవలం సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తితో.... పరిశ్రమ, రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కరోనా వేళ భారీగా నష్టపోయిన ఫౌల్ట్రిరంగం... కేంద్ర రాష్ట్రాల ప్రోత్సాహంతో కోలుకుంది. అంతలోనే శరవేగంగా వ్యాపించిన అసత్య ప్రచారాలు పరిశ్రమకు శరఘాతంలా తగిలాయి.
కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ వంటి 9 రాష్ట్రాల్లో మాత్రమే కనిపించిన బర్డ్‌ఫ్లూ ప్రభావంతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఐతే, భయం, అపోహలతో కోడిమాంసం, గుడ్లు తినేందుకు వినియోగదారులు విముఖత వ్యక్తం చేయడంతో.... అమ్మకాలపై పెద్ద ప్రభావమే చూపింది. 30 శాతం విక్రయాలు పడిపోవడం పరిశ్రమను ఆందోళనకు గురిచేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 4వేల కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 700 కోట్ల రూపాయలు వరకు ఆదాయం క్షిణించినట్లు..... నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ - నెక్ అంచనా వేసింది.
వైరస్ వ్యాప్తి వదంతుల వేళ తెలంగాణ, ఏపీలో రైతులు తక్కువ ధరలకే బ్రాయిలర్, లేయర్ కోళ్లు, గుడ్లు విక్రయించారు. కొందరు ఉచితంగా పంపిణీ చేయగా... మరికొందరు పారబోశారు. పలువురు రైతులు ఫారాలు తీసేశారు. ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో కోళ్ల పరిశ్రమ నిలదొక్కుకుంది. సామాన్యులకు అందుబాటు ధరలో లభించే కోడి మాంసం, గుడ్ల విక్రయాలు... ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ కోళ్ల పరిశ్రమపై.... క్రమంగా వదంతులు తొలిగిపోతుండడం పట్ల వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారాలు సాఫీగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.