రంగారెడ్డి జిల్లాలో కుమ్మరుల జీవితాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. లాక్డౌన్ కారణంగా వేసవి గిరాకీని పూర్తిగా కోల్పోయిన కుమ్మరులు... దీపావళి పండగైనా తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ... వారి ఆశలు ఎండమావులే అవుతున్నాయి. కుండలు, దీపాంతలు కొనుగోలు చేసేందుకు ఎవరూ రాకపోవటం వల్ల దీపావళి కూడా నిరాశనే మిగులుస్తోందని కుమ్మరులు వాపోతున్నారు.
యాచారం మండలం నందివనపర్తి సహా చుట్టు పక్కల గ్రామాల్లో కులవృత్తినే నమ్ముకొని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏటా వేసవిలో చలువ కుండలతోపాటు దీపావళి నోములకు వాడే గరిగెబుడ్లు, ప్రమిదలు, చెమ్మలు, దొంతులు, దీపాంతలు తయారు చేసి నగరానికి సరఫరా చేస్తుంటారు. సమీప గ్రామాల ప్రజలు నందివనపర్తికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. కరోనా కారణంగా తమ ఇళ్ల వైపు ఎవరూ రావడం లేదని... సరుకంతా ఇళ్లల్లోనే ఉండిపోయి ఆర్థికంగా నష్టపోయామని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.