ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
మృతదేహాలను తూర్పుగోదావరి జిల్లా రామవరం మీదుగా నర్సీపట్నం తరలించనున్నారు. మృతదేహాలు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో డివిజనల్ కమిటీ సభ్యుల (డీసీఎం) క్యాడర్‌లో ఉన్న సందె గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్‌తో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతునాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, కార్బన్, .303 రైఫిల్, తపంచా, ఎస్‌బీబీఎల్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
అగ్రనేతలను కాపాడబోయి..
విశాఖలోని తీగలమెట్ట అడవిలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టుల్లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు అరుణ, ఉదయ్, జగన్ మరికొందరు అగ్రనేతలున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉండడంతో ఎదురు కాల్పులు జరిగాయి. అగ్రనేతలను సురక్షితంగా అడవిని దాటించే క్రమంలో రక్షణగా నిలిచిన మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
అత్మరక్షణ కోసమే కాల్పులు
తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశాలు నిర్వహించి గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని సమాచారం రావడంతో...వారిని నిరోధించడానికి కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. లొంగిపోవాలని చెప్పినా పట్టించుకోలేదని.. ఆత్మరక్షణార్థం తిరిగి కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వారు లొంగిపోతే మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని అన్నారు. మన్యం ఎదురుకాల్పులతో ఇరురాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇదీచదవండి: Vishaka Crossfire : విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు హతం!