KCR Hoardings in Varanasi: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమాని యూపీలోని ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే వ్యక్తి.. చౌక ఘాట్, ఫట్మన్ రోడ్‌తో పాటు ముఖ్యమైన సెంటర్లలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు విషెష్ చెబుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్‌లపై 'దేశ్ కీ నేత కేసీఆర్' అని రాసి ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రధానమంత్రి పదవికి అర్హులు
కేసీఆర్ హోర్డింగ్లు ఏర్పాటు చేసిన మృత్యుంజయ మిశ్రా ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. వారణాసిలో హోర్డింగ్లు ఏర్పాటు చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని మిశ్రా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకే పెట్టినట్లు తెలిపారు. ఇది రాజకీయాలతో సంబంధం లేని అంశమని అన్నారు. అయితే కేసీఆర్ ప్రధాన మంత్రి పదవికి అర్హులని చెప్పారు. ప్రస్తుతం దేశంలో చాలా మంది నేతలు ప్రధాని పదవి రేసులో ఉన్నారని... అందులో కేసీఆర్ కూడా ఒకరని పేర్కొన్నారు.
కేసీఆర్‌దే కీలక పాత్ర
'కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే మా ఆకాంక్ష. మీ సాయంతో మేం శుభాకాంక్షలు కూడా చెప్పాం. మీ సాయంతో ఇది కేసీఆర్‌కు కూడా చేరుకుంది. మేము ఎన్నో ఏళ్లు తెలంగాణలో పనిచేశాం. ఉద్యమాన్ని దగ్గరి నుంచి చూశాం. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటును దగ్గరి నుంచి చూశాం. ఎంతో మంది త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర కేసీఆర్‌దే అవుతుంది. ఇది ఎవరు కాదనలేని నిజం.'
- మృత్యుంజయ మిశ్రా, కేసీఆర్ వీరాభిమాని
ఇదీ చదవండి : Cm Kcr Birthday Celebrations: పూరి సముద్రతీరంలో సీఎం కేసీఆర్ సైకతశిల్పం