కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. అయితే లాక్‌డౌన్ కొనసాగించాలా..లేదా అనే విషయమై రేపు మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ అమలు, ఇంటింటి జ్వరసర్వే(fever survey), కొవిడ్ ఓపీ సేవలు తదితరాలతో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతోంది. మహమ్మారి వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే వివిధ వర్గాలవారిని సూపర్ స్ప్రెడర్లుగా(super spreaders) గుర్తించి. ప్రత్యేకంగా టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఏంచేస్తే బాగుంటుంది..
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌పై ఏంచేస్తే బాగుంటుందన్న విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) వివిధ వర్గాలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. లాక్‌డౌన్ మరికొన్నిరోజులు కొనసాగించడం మేలన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వ్యక్తమైనట్లు సమాచారం. ఈ తరుణంలో లాక్‌డౌన్ మరోవారం లేదా పది రోజులు పొడిగించడం వల్ల వైరస్ వ్యాప్తిని ఇంకా కట్టడి చేయవచ్చనే అభిప్రాయంతో.. సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇంకా కొన్నిరోజులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆంక్షలు కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
నివేదికలు సిద్ధం..!
ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 4గంటలపాటు సడలింపు ఉంది. ఆ సమయంలో ప్రజలు భారీగా బయటకు వస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు ఆ సమయంలో మార్పుచేయాలన్న ఆలోచన ప్రభుత్వవర్గాల్లో ఉంది. ఉదయం 6గంటల నుంచి కాకుండా.... 7నుంచి 12 గంటల వరకు సడలింపు ఇవ్వాలని అంటున్నారు. మినహాయింపుల పేరుతో భారీగా రోడ్లపైకి వస్తున్నవారిని కట్టడి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆయాశాఖలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. అన్నిఅంశాలను పూర్తిస్థాయిలో చర్చించి రేపటి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవారం, 10రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని...అయితే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున కొన్ని సడలింపులు ఉండొచ్చని ప్రభుత్వవర్గాల సమాచారం.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్