వెంకటరెడ్డిపేట.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండంలోని ఓ పంచాయతీ..! ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్రతీసారి సర్పంచ్ లేకుండా పాలన సాగిపోతుంది. వార్డు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగడం.. వారిచేత ఎన్నుకైన ఉపసర్పంచే.... సర్పంచ్‌గా పాలన సాగించడం ఓ తంతులా మారిపోయింది.
అసలు కథ ఇదీ..
వెంకటరెడ్డిపేట షెడ్యూల్-5లో ఉన్న గిరిజన ప్రాంతం. ఇక్కడ రిజర్వేషన్ల అంటే...ఎస్టీ జనరల్ కావాలి లేదంటే ఎస్టీ మహిళకు కేటాయించాలి. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడమే సమస్యకు కారణమైంది. రిజర్వేషన్లు ఏమైనా మార్చే అవకాశం ఉందా అంటే ఎట్టిపరిస్థితుల్లో కుదరదు. మార్చాలంటే రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవాలి. ఇదీ అంత సులభంగా జరిగే పని కాదంటున్నారు నిపుణులు..!
ఉప సర్పంచే..
ఒక్క గిరిజనుడూ లేకపోయినా.. గత కొన్ని పర్యాయాలుగా వెంకటరెడ్డిపేట పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతోంది. ఫలితంగా సర్పంచ్ పీఠం ఖాళీగా ఉంటూ మిగిలిన వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఆరు వార్డుల్లో 295 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో.. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేరు. బీసీ, ఇతరులు ఉన్నారు.
ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవడం.. ఆయనే సర్పంచ్‌గా పాలన సాగించడం ఇక్కడ రివాజుగా మారింది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ పడని విచిత్ర పరిస్థితి ఇక్కడ నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ మార్చే అవకాశం లేదని, వెంకటరెడ్డిపేట పంచాయతీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి.నాగేశ్వర నాయక్ చెప్పారు.