ఆంధ్రప్రదేశ్లో రెండోదశ పల్లెపోరు ప్రారంభమైంది. రెండో విడతలో 3వేల328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 539 ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానందున ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 2 వేల 786 సర్పంచ్ స్థానాలకు 7 వేల 507 మంది పోటీ పడుతున్నారు. 33 వేల 570 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 20 వేల 817 వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశకు 29 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.... ఇందులో 5 వేల 480 సున్నితమైనవిగా.... 4 వేల 181 అతిసున్నితమైనవిగా గుర్తించినట్టు పంచాయతీరాజ్ శాఖ వివరించింది.
పలు ప్రాంతాల్లో...
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.