Secunderabad riots case update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనక అదృశ్య శక్తుల పాత్ర ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆందోళనకారులు వచ్చీరాగానే స్టేషన్లో ఏది ఎక్కడుందో బాగా తెలిసినట్లు ప్రవర్తించడం, వ్యూహాత్మక ప్రాంతాలను కట్టడి చేయడాన్నిబట్టి స్టేషన్ పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తులెవరైనా వారికి సహకరించి ఉంటారని బలంగా విశ్వసిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం తాజాగా రాష్ట్ర పోలీసుశాఖను కోరినట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గత శుక్రవారం నిరుద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చిన దాదాపు రెండు వేల మంది.. వచ్చీరాగానే రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చేలోపే భారీ నష్టం కల్గించారు. ఈ ఊహించని ఘటనలో వారు అనుసరించి విధానం మాత్రం పోలీస్ అధికారులను విస్మయానికి గురిచేసింది. "ఆందోళనలో పాల్గొన్న వారంతా రకరకాల ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వాట్సప్ సంభాషణల ద్వారానే అనుకున్న సమయానికి ఒక్కచోటుకు వచ్చారు. అందరూ స్టేషన్‌కు చేరుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత బృందాల వారీగా విడిపోయి విధ్వంసానికి దిగారు.
వాస్తవంగా పదో నంబరు ప్లాట్‌ఫాం వైపు అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఇది స్టేషన్ సిబ్బందిలో చాలామందికి తెలియదు. ఆందోళనకారుల్లో కొందరు మాత్రం సరాసరి అటువైపు వెళ్లి పట్టాలపై రాళ్లు వేశారు. అక్కడి వాహనాలు గానీ, సిబ్బంది గానీ ముందుకు రాకుండా కట్టడి చేశారు. అన్నింటినీ మించి రైళ్లలో నీటి అవసరాలకు తీర్చేందుకు పట్టాల మధ్యలో ఏర్పాటు చేసిన పైపులకు నీటిని సరఫరా చేసే మోటార్లను ఎవరో ఆపారు. అసలు ఈ మోటార్లు ఎక్కడుంటాయో తమకే తెలియదని స్టేషన్ సిబ్బంది కొందరు దర్యాప్తులో వెల్లడించారు. వీటన్నింటినీ విశ్లేషిస్తే స్టేషన్ గురించి అణువణువు తెలిసిన, అక్కడి పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న వారు ఎవరైనా ఆందోళనకారులకు సహకరించి ఉంటారని విశ్వసిస్తున్నామని" ఓ అధికారి అభిప్రాయపడ్డారు. రైల్వేశాఖకు చెందిన వారుగానీ, అక్కడ పనిచేస్తున్న లేదా గతంలో పనిచేసిన వారుగానీ ఆందోళనకారులకు సమాచారం ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. దీన్ని నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: