సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్కు ఘటన మరకవముందే తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాల్పుల ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు ఘటనల్లో తుపాకులు మాయమై నెలలు గడిచినా... పోలీసులు వాటిని కనిపెట్టలేకపోయారు. చివరకు నిందితులు దొరికితే తప్ప వాటి ఆచూకీ దొరలేదు. దీన్ని బట్టి పోలీసుల విచారణ ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు.
కేబీఆర్ పార్కు వద్ద 2014 నవంబరులో అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిని అపహరించేందుకు వచ్చిన ఆగంతకుడు... ఏకే47తో కాల్పులు జరిపాడు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చిందనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. అది గ్రేహౌండ్స్ విభాగం నుంచి 18 నెలల క్రితమే మాయమైనట్లు విచారణలో తేలింది. దీనిపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో గ్రేహౌండ్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రేహౌండ్స్ సిబ్బందిని విచారించగా... కూబింగ్‌కు వెళ్లిన సమయంలో అడవుల్లో పడిపోయి ఉంటుందని సమాధానమిచ్చారు. కాల్పులు జరిపిన అగంతకుడు... గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసినప్పుడు అపహరించినట్లు కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనతో బయటపడింది.
తాజాగా హుస్నాబాద్ అక్కన్నపేటలో... సదానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపి, మరుసటి రోజే చిక్కడం పోలీసుశాఖలో చర్చానీయాంశమైంది. సదానందం వద్ద ఏకే 47తో పాటు కార్బైన్ లభించడం కలకలం రేపింది. గతంలో వాటిని హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచే అపహరించినట్టు... దర్యాప్తులో చెప్పిన సదనందం సమాధానానికి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. కేబీఆర్ పార్కు ఘటనలో పది రౌండ్లు, హుస్నాబాద్ ఘటనలో మూడు రౌండ్లు మాత్రమే పేలాయి. ఆటో మోడ్‌లో ఉంటే మాత్రం... తుపాకీలో ఉండే 30 తూటాలు క్షణాల వ్యవధిలో బయటకు వచ్చి విధ్వంసం జరిగేదని పోలీసులు అధికారులు అంటున్నారు.
ఇదీ చూడండి: వృత్తి చార్టర్డ్ అకౌంటెంట్.. చేసేది పన్ను ఎగవేత