ఏపీలోని ప్రకాశం జిల్లా కారంచేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్.భాస్కరరావు దయనీయ గాథ ఇది. కొవిడ్ చికిత్స కోసం ఆయన ఏప్రిల్ 24న విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో, తరువాత గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నందున వెంటనే వాటిని మార్చాలని అక్కడి వైద్యనిపుణులు చెప్పడంతో... అందుకు అవకాశం ఉన్న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.
ఊపిరితిత్తులు మార్చేందుకు రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ భాస్కరరావు సతీమణి భాగ్యలక్ష్మి కూడా వైద్యురాలే. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దంపతులిద్దరూ గతంలో కారంచేడు, చీరాల, పర్చూరు, దగ్గుబాడు తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించారు. మంచి వ్యక్తులుగా పేరుండటంతో... భాస్కరరావు వైద్యానికి ఈ ప్రాంత ప్రజలు రూ.20 లక్షలకు పైగా సాయం అందజేశారు. మిగిలిన నిధుల సర్దుబాటు ఎలా అని కుటుంబసభ్యులు ఆందోళనగా ఉన్నారు.
ఇవీచూడండి: Love Journey: బెంగళూరు టూ హైదరాబాద్.. వయా పాకిస్థాన్