PG Medical Admissions 2022 : అఖిల భారత కోటాలో తొలివిడత పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్ ఈ నెల 15 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండోవిడత కౌన్సెలింగ్ అక్టోబరు 10 నుంచి 18 వరకూ కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి పీజీ వైద్యవిద్య తొలివిడత కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు, రెండో విడత అక్టోబరు 15 నుంచి 26 వరకు వరకు నిర్వహిస్తారు.
మరోవైపు రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్ ఆఫ్ ఇంటెంట్) జాతీయ వైద్య కమిషన్ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.