ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి రూ.8,476 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో కలిపి రూ.15,500 కోట్లు ఖర్చు చేశారు. కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పటికే ఎక్కువగా ఖర్చు అయింది. ఇంత భారీ మొత్తం వెచ్చించినా... గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ, పునరావాసం, విద్యుత్తు బకాయిలు అన్నీ కలిపి ఇంకో రూ.పదివేల కోట్లకుపైగా చెల్లించాలి. ఒక్క గుత్తేదారులకు ఇవ్వాల్సిన మెుత్తం రూ.5 వేల కోట్లకు పైగా ఉంది. ఫలితంగా పలు చోట్ల పనులపై ప్రభావం పడినట్లు సమాచారం. కొన్ని చోట్ల బ్యాంకు రుణాలకు చెల్లించాల్సిన మార్జిన్ మనీ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో చేయనున్న పనులతో పాటు బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే నిధులు భారీగా అవసరమవుతాయి.
అరకొరగానే కేటాయింపులు...
ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌లో రూ.13,655 కోట్లు కేటాయించినా... పూర్తిస్థాయి బడ్జెట్‌లో మాత్రం రూ.8,476 కోట్లకు తగ్గించింది. ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్లు చెల్లించింది. బ్యాంకు రుణాల కింద రూ.8,500 కోట్లు ఇచ్చారు. అంటే సాగునీటి రంగానికి చేసిన మొత్తం ఖర్చు రూ.15,500 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకు రూ.5,400 కోట్లు చెల్లించగా, బడ్జెట్ నుంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. మొత్తం ఖర్చులో సగానికిపైగా ఈ ప్రాజెక్టుకే కేటాయించినా... ఇంకా రూ.2 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
బిల్లులు పెండింగ్...
సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, వరద కాలువ, కంతన పల్లి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో బ్యాంకుల ద్వారా రూ.3,100 కోట్లు చెల్లించారు. పాలమూరు పథకంలో జరిగిన పనులకు ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ.1,500 కోట్లకు పైగానే ఉంది. డిండి, సీతారామ, ప్రాణహిత, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టుల పనుల్లోనూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికులకు పౌరసమాజం మద్దతుగా నిలవాలి