Revanth Reddy on Current Charges hike: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలను చర్చకు తావులేకుండా నియంత్రణ మండలి తిరస్కరించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు సంస్థలకు రూ.11 వేల కోట్లు అప్పు ఉండగా ఇప్పుడది రూ.60 వేల కోట్లకు చేరిందని అన్నారు. విద్యుత్తు నియంత్రణ మండలి ఎదుట విద్యత్ ఛార్జీల పెంపుపై జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి విద్యుత్తు అధికారుల ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఎగవేస్తోంది!
'ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు ప్రభుత్వం ఏటా రూ.16 వేల కోట్లు చెల్లించాలి. కానీ రూ.5,600 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. రూ.10 వేల కోట్లను ఎగవేస్తోంది. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమే. సామాన్యులు బిల్లులు కట్టకపోతే నానాయాగి చేసి.. క్రిమినల్ కేసులు పెడుతారు. అదే ప్రభుత్వం చెల్లించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.' - రేవంత్ రెడ్డి
ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదు
పూర్తిస్థాయిలో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం లేదని, ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తూ విద్యుత్తు సంస్థలను చంపేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్తు సంస్థల పనితీరుపై ఇచ్చిన ర్యాంకుల్లో తెలంగాణాకు చెందిన ఎస్పీడీసీఎల్‌కు 23వ స్థానం, ఎన్‌పీడీసీఎల్ 33వ స్థానాలకు దిగజారాయని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారని... ప్రాజెక్ట్ ప్రమాదం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
లేఖ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి నిరసన
విద్యుత్తు ఛార్జీలు పెంచొచ్చని విద్యుత్తు సంస్థలకు ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ శ్రీరంగారావు లేఖ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వినియోగదారుల పక్షాన నిలువాల్సిన ఈఆర్సీ ఇలా లేఖ ఏలా ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లేఖ ఏ సందర్భంలో ఇచ్చారో...తనకు తెలియదని.. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరష్కరించడంతోపాటు శ్రీశైలం ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పేదలపైనే ఎక్కువ భారం
విద్యుత్తు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. తక్కువ విద్యుత్తు వాడుకునే... పేదలపై 56 శాతం పెరుగుదల భారం పడుతోందని అన్నారు. ఎక్కువ విద్యుత్తు వాడకందారులకు కేవలం 8 శాతం పెరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కసారిగా యూనిట్‌పై యాభై పైసలు పెంచుతూ ప్రతిపాదించడం సరికాదని స్పష్టం చేశారు. క్షౌరశాలలకు, ఇస్త్రీ షాపులకు ఇస్తున్నట్లు అన్ని రకాల చేతివృత్తుల వారీకి 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదు.. అయినా రూ.2600 కోట్ల లోటు!'