ఏ ఆశయాల కోసమైతే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందో.. ఆ ఆశయాల కోసం జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతం జన్మనిస్తే.. తెలంగాణ ప్రాంతం పునర్జన్మ ఇచ్చిందని.. ఇలాంటి ప్రాంతంలో ఎలాంటి సామాజిక చైతన్యం ఉండాలో ఆ దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో వీర మహిళ తెలంగాణ విభాగంతో పవన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు.
తొలి అడుగు:
పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14లోపే రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి.. పార్టీ బలోపేతం దిశగా తొలి అడుగు వేద్దామన్నారు. ఓట్లు పడినా పడకపోయినా ప్రజలకు మంచి జరిగే ఒక బలమైన రాజకీయ పార్టీ ఉంటే తప్ప.. సమస్యలను ఎదుర్కోలేమన్నారు.
డబ్బిస్తేనే ఓటు:
రౌడీయిజం, దౌర్జన్యం చేసేవాళ్లే రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. మధ్య తరగతి వారిని, చదువుకొని స్వశక్తితో పైకెదిగిన వ్యక్తులను రాజకీయాల్లోకి రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున డబ్బిస్తేగాని ఓటు పడని పరిస్థితి దేశంలో తలెత్తిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రత్యర్థులు కూడా అభినందించాల్సిందే: కేటీఆర్