Pawan Kalyan comments: ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరోసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని చెప్పారు. తిరుపతి రామానుజపల్లి జీఆర్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
"ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. వైకాపాకు, తెదేపాకు కొమ్ము కాసేందుకు మేం సిద్ధంగా లేం. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాం. కులం అంటే పిచ్చి మమకారం నాకు లేదు. వైకాపా నేతలు మంచి చేస్తున్నారో లేదో చెప్పాల్సింది మేం.. వాళ్లు కాదు. అందరూ చేతులు కట్టుకోవాలని కోరుకోవడమే ఆధిపత్య ధోరణి." - పవన్, జనసేన అధినేత
రాయలసీమలో దళితుల గొంతు నొక్కుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. కడప జిల్లాలో పరిశ్రమలు ఎందుకు రావటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజల్లో చైతన్యం, మార్పు రావాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ఎక్కువంటారు.. తనకెప్పుడూ అలా కనిపించలేదని చెప్పారు. పాలకులు సమస్యల పరిష్కారంపై, మౌలిక వసతులు, రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడీ జరుగుతోందని విమర్శించారు. పంచాయతీలకు సక్రమంగా నిధులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలకు ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయన్నారు.
ఇవీ చూడండి