వ్యవసాయ సీజన్‌లో రైతులు నాలుగుసార్లు నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్... పంట కలుపు తీయడానికి డబ్బులు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న పవన్... పంట నష్టపోతే ప్రాణాలు తీసుకోవడం రైతుల దీనస్థితికి నిదర్శనమన్నారు.
"కృష్ణా, గుంటూరులో రైతులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాను. క్షేత్ర పరిశీలన తర్వాత పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం. కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది. కౌలు రైతు, భూమి దున్నే రైతుల కోసం 'జైకిసాన్' కార్యక్రమం చేపడతాం. లాల్‌బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో రైతు సంఘాలతో చర్చలు జరుపుతాం. రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం అందివ్వాలి. రైతులు లాభసాటిగా ఉండాలనే కేంద్రం కిసాన్ బిల్లులు తెచ్చింది. కిసాన్ బిల్లులపై అభ్యంతరాలు ఉంటే చెప్పండని కేంద్రం కోరుతోంది."
-పవన్ కల్యాణ్
సమస్య వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ మాత్రమే స్పందించాలా..?
జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని పవన్ హెచ్చరించారు. భాజపాతో జాయింట్ కమిటీ సమావేశం తర్వాతే తిరుపతి ఎంపీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతు విరాళాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... సమస్య వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ మాత్రమే స్పందించాలా..? అని వ్యాఖ్యానించారు. విరాళమనేది స్పందించి ఇష్టపడి ఇవ్వాలన్నారు. రూ.150 కోట్లు, రూ.200 కోట్లు ఇచ్చి రాజ్యసభ సీట్లు కొనుక్కున్న వాళ్లు విరాళాలు ఇవ్వాలన్నారు. ప్రజలు ఎన్నుకున్నవారు, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించాలని పేర్కొన్నారు.
రజనీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు ..
సూపర్‌స్టార్ రజనీ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ... ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా రజనీకాంత్ ఎప్పటి నుంచో.. రాజకీయాల్లో భాగంగా ఉన్నారన్నారు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానించాల్సిందేని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రీపోలింగ్‌పై నిర్ణయమేంటి?