ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన...నిన్న నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడారు. ఇవాళ కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని రైతులను అడిగి పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ద్వారా పరిహారం అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని అన్నదాతలకు పవన్ హామీ ఇచ్చారు.
ఈనెల 7న నిరసన దీక్షలు
మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని నష్టపోయి రైతులకు కేటాయించాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రా గోల్డ్ అంటే మద్యం బ్రాండ్ అనుకోలేదని విమర్శించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ...ఈ నెల 7న నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మూడోసారి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. దాదాపు 17 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు.
తిరుపతి ఉప ఎన్నికకు సమన్వయ కమిటీ
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం అర్థమైందని పవన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు బలమైన సంకేతం పంపేలా చేసినట్లయిందన్నారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సమన్వయ కమిటీ వేస్తున్నట్లు పవన్ చెప్పారు. స్థానిక నాయకత్వం అభిప్రాయాలు తీసుకుని తిరుపతి ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామన్నారు.