హైదరాబాద్‌లో మొదటి దశ తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ(TSRTC) సంస్థ వెయ్యికిపైగా బస్సుల్ని తగ్గించేసింది. రెండో దశ తర్వాత జనజీవనం సాధారణంగా మారి క్రమంగా ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్నా సర్వీసుల్ని మాత్రం పెంచకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పది దాటితే బస్సు కనిపించడమే గగనమవుతోంది. తగినన్ని సర్వీసులే నడపని ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకోవడమే మానేసింది. ఫలితంగా చాలా వరకు బస్టాపులు తగ్గిపోగా ఉన్నవి సైతం షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. కాలంతోపాటు మారుతూ ఇతర ఆదాయమార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కొత్తగా సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో నగర ప్రజారవాణాలో కీలకమైన ప్రగతి రథ చక్రాలను గాడిలో పెడతారని సగటు ఆర్టీసీ ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
నగరంలో ఎంఎంటీఎస్, మెట్రో కలిపి 83 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 83లో 38 స్టేషన్లకే ఆర్టీసీ బస్సు అనుసంధానమై ఉంది. మిగతా స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించేందుకు బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
పదింటికే నిద్దరోతున్న ప్రజారవాణా
నగరంలో ప్రజారవాణా(TSRTC) రాత్రి 10 గంటలకే మూగబోతోంది. ఆ తర్వాత ఎంఎంటీఎస్ రైలు, ఆర్టీసీ సిటీ బస్సులు కానీ రహదారులపై కనిపించని పరిస్థితి. గతంలో రాత్రి బస్సులుండేవి.. వేకువజామున 4 గంటలకే రోడ్డెక్కేవి.. ఇప్పుడవేవీ కనిపించడంలేదు. రాత్రి 8 గంటల నుంచే డిపోల బాట పడుతున్నాయి. ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇంకా ఆలస్యం అయితే 10.30కి స్టేషన్లో ఆగుతుంది. ఈ రైలు దిగి వచ్చే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు కనిపించడంలేదు. దీంతో ఆటోలు, క్యాబ్‌ల ద్వారా ఇళ్లకు చేరాల్సి వస్తోందని పులువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాగే ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి సిటీ బస్సులు రాత్రి 11 గంటల వరకూ ఉండేలా చూడాలంటున్నారు.
పాసులిస్తే సరిపోయినట్లేనా?
విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులున్నాయా? అంటే లేవనే చెప్పాలి. 3,750 బస్సులు రోడ్డెక్కినప్పుడే విద్యార్థులు బస్సుల్లో వేలాడుతూ కనిపించేవారు. ప్రస్తుతం 1000 బస్సులు తగ్గించారు. ఇక విద్యార్థుల పాట్లు ఎలా ఉంటాయో ఊహించవచ్ఛు నగరంలో 4.50 లక్షల విద్యార్థుల పాస్‌లను ఏటా ఆర్టీసీ జారీ చేస్తోంది. మరోవైపు ఆర్డినరీ బస్సులన్నీ తుక్కుగా మారడంతో ఏటా 250 వరకూ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 2,500 ఆర్డినరీ బస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 1,450కు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు బస్సు పాస్‌లు తీసుకోడానికి వెనుకాడుతున్నారు. పాస్‌లు జారీకి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది కానీ.. విద్యార్థులకు సరిపడా బస్సులు వేయాలనే ఆలోచన చేయడంలేదు.
కనుమరుగవుతున్న స్టాపులు
వివిధ అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో ఇష్టారాజ్యంగా స్టాపులను తొలగించడంతో బస్సులు ఎక్కడ ఆపాలో తెలియని పరిస్థితి. దీంతో ప్రయాణికులు ఎలా బస్సులను అందుకోవాలో అర్థం కాక రహదారులపై పరుగులు పెట్టాల్సి వస్తోంది. నగరంలో గతంలో 2200 చోట్ల బస్సు షెల్టర్లు ఉండేవి. వివిధ కారణాల నేపథ్యంలో పలుచోట్ల ఎత్తివేయడంతో ప్రస్తుతం 1300 మిగిలాయి. మరోవైపు, అవసరమున్నా.. లేకున్నా.. ప్రకటనలకు గిరాకీ ఉంటే అక్కడ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 6 చోట్ల ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించినా అది మూణ్నాళ్ల ముచ్చటలా మారింది.
టిక్కెటేతర ఆదాయంపై దృష్టి ఏది?
నగరంలో 9 కమ్యూనిటీ ఎమినిటీ సెంటర్లు(మినీ బస్సు స్టేషన్లు)ఉన్నాయి. హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అఫ్జల్‌గంజ్, కోఠి, కాచిగూడ, బాలానగర్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్సు, పటాన్‌చెరు, రేతిఫైల్ కమ్యూనిటీ సెంటర్లలో వేల అడుగుల మల్గీలు ఖాళీగా ఉన్నాయి. కరోనాకు ముందు సగంపైగా ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం 80 శాతం ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్సు స్టేషన్లలో కూడా దాదాపు ఖాళీగా ఉన్నాయి. వీటి అద్దె నిబంధనలు కఠినంగా ఉండడంతోపాటు.. వ్యాపార అవకాశాలను అంచనా వేయకుండా అద్దెలు వసూలు చేస్తుండడంతో దుకాణాలను తీసుకోడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీన్ని సమీక్షించి టిక్కెటేతర ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.