భాగ్యనగరంలో పచ్చదనానికి ఒకప్పుడు పెద్దగా చోటు ఉండేది కాదు. అక్కడక్కడా విసిరేసినట్టుగా కనిపించే పార్కులు మినహా.... అందమైన చెట్లకు తావు లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. 2014 నుంచి భాగ్యనగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సర్కారు విశేష కృషి చేస్తోంది. హరితహారం సహా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టి లక్షలాది మొక్కలను నాటడంతోపాటు.... భారీగా పార్కులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
నాలుగేళ్లలో రెండు కోట్లకు పైగా...
భూమికి పచ్చాని రంగేసినట్టు... తెలంగాణ తల్లికి పచ్చల హారం వేయాలన్న లక్ష్యంతో సర్కారు హరితహారం కార్యక్రమాన్ని 2016లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. 2014 కు ముందు రాష్ట్రంలో 24 శాతం గ్రీన్ కవర్ ఉండగా ప్రస్తుతం దాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కాగా.. ప్రస్తుతం 29 శాతానికి పెరగటం విశేషం. ఇక హరితహారంలో భాగంగా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే గడచిన నాలుగేళ్లలో రెండు కోట్లకు పైగా మొక్కలు నాటినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాలు పచ్చరంగును అద్దుకుని.. స్వచ్ఛమైన గాలులను పీలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
బడ్జెట్లో పది శాతం...
హరితహారం కింద 2016-17లో జీహెచ్ఎంసీ పరిధిలో 84 లక్షల మొక్కలు నాటగా... 2017-18లో 76 లక్షలు, 2018-19లో కేవలం 43 లక్షలు , 2019-20 లో 72 లక్షల మొక్కలను నాటింది సర్కారు. మొత్తం నాలుగేళ్లలో 2 కోట్ల 76 లక్షల మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీని పచ్చదనాలు పరుచుకున్న పట్నంగా మార్చాలని భావిస్తున్న బల్దియా.... బడ్జెట్లోంచి పదిశాతం నిధులను పచ్చదనం పెంపునకు కేటాయించింది. ఇక హరితహారంతో పాటు... పార్కుల అభివృద్ధిని ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది బల్దియా.
500 నర్సరీలు ఏర్పాటుకు ప్రణాళికలు
ఇందులో భాగంగా 2020 ఏడాదికిగాను 2.5 కోట్ల మొక్కలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 11నాటికి 2.08కోట్ల మొక్కల నాటి... పచ్చదనం పెంపులో తన చిత్తశుద్ధిని చాటింది. ఆయా మొక్కలను పార్కులతో పాటు 405 బహిరంగ ప్రదేశాల్లో నాటించింది. యాదాద్రి మోడల్లో 65 చోట్ల మియావాకి మొక్కలను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. 2021 ఏడాదికి నగరంలో 500 నర్సరీలను ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది కాలంలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే జోన్‌కు 25 లక్షల చొప్పున కోటి యాభై లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించింది.
గల్లీగల్లీకి పార్కు...
నగరవాసులకు ఆరోగ్యానందాన్ని పంచే లక్ష్యంతో అనేక రకాల పార్కులను అందుబాటులోకి తీసుకువచ్చింది జీహెచ్ఎంసీ. 5 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో మొత్తం 19 పార్కులు బల్దియా పరిధిలో ఉండగా... 17 థీమ్ పార్కులు హెర్బల్, వెదురు థీమ్ పార్కులు, చిన్నా పెద్దా కాలనీల్లో కలిపి 919 కాలనీ పార్కులు, సెంట్రల్ మీడియన్ గ్రీనరీ కింద 105 స్ట్రేచేస్లో మొత్తం 160 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. 46 ట్రాఫిక్ ఐస్ ల్యాండ్స్, రోటరీస్, 18 ఫ్లై ఓవర్లపై లాండ్ స్పేస్ గ్రీనరీ, 327 ట్రీ పార్కులు, 31 చోట్ల వర్టికల్ గార్డెన్లు, జనసంచారం అధికంగా ఉండే 41 కూడళ్లలో పచ్చదనంతో కూడిన అందమైన ఆకృతులను అందుబాటులోకి తెచ్చారు.
1833 ప్రాంతాలు పార్కులుగా...
జీహెచ్ఎంసీ పరిధిలోని 3091 ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలను గుర్తించిన అధికారులు అందులో 1258 ప్రాంతాలు ఆట స్థలాలు, కమ్యునిటీ హాల్స్గా కబ్జాకు గురికావటం వల్ల మిగిలిన 1833 ప్రాంతాలను పార్కులుగా తీర్చిదిద్దుతోంది. ఇక ఇప్పటికే మొక్కలు నాటినప్పటికీ 587 ప్రాంతాల్లో నిర్వహణా లోపాలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి 83 చోట్ల కాలనీ, థీమ్ పార్కులుగా మార్చారు. చింతల్‌కుంట, ఉప్పల్, మల్లాపూర్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, సంగీత్ జంక్షన్, సుచిత్ర సర్కిల్, ఫోరమ్ మాల్ జంక్షన్, శిల్పారామం, ఐకియా జంక్షన్, లక్డికాపూల్, రోజ్ సర్కిల్ లక్డికాపూల్, ఆరామ్‌ఘర్ జంక్షన్ వంటి ప్రాంతాల్లో మొక్కలతో బ్యూటిఫికేషన్‌ను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి నగరంలో కొత్తగా 50 భారీ థీమ్ పార్కుల అభివృద్దికి చర్యలు చేపట్టిన బల్దియా ఇందుకోసం రూ.134.23 కోట్లు మంజూరు చేసింది.
రకరకాల థీమ్‌లతో 50 పార్కులు...
జంట నగరాల్లో మొత్తం 50 థీమ్ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. బస్తీ పిల్లలకు విద్య నేర్పే నాలెడ్జ్ పార్కు... పూల అలంకరణ పార్కు, రంగుల పార్కు, జపనీస్ థీమ్ పార్కు, వైద్య శాస్త్ర గార్డెన్, పిల్లల పార్కు, మహిళలకు ప్రత్యేక పార్కు , వెదురు బొంగులతో ఏర్పాటు చేసే పార్కు ఇలా వినూత్నంగా ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నారు. బహుతరాల పార్కు, మొగల్ గార్డెన్, ఛాయా పార్కు, ఇంట్రాక్టివ్ పార్కు, భ్రాంతిని కలుగజేసే పార్కు, కమ్యూనిటీ పార్కు, సైన్స్ థీమ్ పార్కు, సువాసనలు వెదజల్లె పార్కు, బండరాతి పార్కు, పర్యావరణ పార్కు, బతుకమ్మ పార్కు, క్రీడల పార్కు, పూల మొక్కల పార్కు, వ్యాయమ శాల పార్కు, ఎల్ఈడీ పార్కు, సెవెన్ వండర్స్ పార్కు ఇలాంటివి మొత్తం 50 పార్కులు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇప్పటికే ఇలాంటి కొన్ని పార్కులను సిద్ధం చేయగా... మిగతా వాటిని కూడా రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. దిల్లీ, ఇండోర్, బెంగళూర్ లాంటి ముఖ్య నగరాల్లో ఉన్న థీమ్ పార్కులను పరిశీలించిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ థీమ్ పార్కులను ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది బల్దియా. ఒక్కో పార్కు నిర్మాణానికి 2 కోట్లు కేటాయించిన బల్దియా.. అదనంగా పూల మొక్కలు, పచ్చదనం అభివృద్ధికి మరో కోటిన్నర వరకు నిధులను ఇవ్వనుంది.
విజ్ఞానం వికసించేలా...
కాప్రా సర్కిల్‌లోని బండబావిలో జీహెచ్‌ఎంసీ నాలెడ్జ్ పార్క్ నిర్మిస్తోంది. ఏరో డైనమిక్స్, శాటిలైట్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ తదితర అంశాలు ఈ ఉద్యానానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 50 రకాల ఔషధ మొక్కలను పెంచుతామని, సైన్స్ ప్రయోగశాలను నిర్మించే ఆలోచన ఉందని, విద్యార్థులకు ఉచిత తరగతులు చెప్పోచ్చంటున్నారు పార్కు నిర్వాహకులు. మల్లాపూర్‌లో 2.2 ఎకరాల్లోని డంపింగ్‌యార్డును ఉద్యానవనంగా తీర్చిదిద్దుతున్నారు. సువాసన, రంగులతో కూడిన పార్కును ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. బీఎన్‌రెడ్డి కాలనీలో 3.5 ఎకరాల్లో టోపియరీ గార్డెన్ , ఏఎస్‌రావునగర్‌లో 1.8 ఎకరాల్లో జపనీస్ గార్డెన్ రూపుదిద్దుకుంటున్నాయి.
ఆరోగ్యానికి కేంద్రాలు పంచతత్వ పార్కులు...
నగరంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వందలాది పార్కుల్లో అత్యంత ముఖ్యమైనవి ఇటీవల అందుబాటులోకి వచ్చిన పంచతత్వ పార్కులు కావటం విశేషం. నగర వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంచావతారాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నిల సమాహారంగా ఈ పంచతత్వ పార్కులు ఏర్పడ్డాయి. నగరం నడిబొడ్డున మొత్తం 17 ప్రాంతాల్లో బల్దియా ఈ పంచతత్వ పార్కులను సిద్ధం చేసింది. ఎల్బీ నగర్ జోన్లో 6, చార్మినార్ జోన్ లో 2, ఖైరతాబాద్ జోన్లో 4, శేరిలింగంపల్లి జోన్ లో 1, కూకట్ పల్లి జోన్ లో 3, సికింద్రాబాద్ జోన్ లో 1 చొప్పున ఈ పంచతత్వ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కోపార్కులో 50 రకాల ఔషధ మొక్కలతో కూడిన సంజీవని వనాలు, రాశీ వనాలతోపాటు... వాకింగ్ ట్రాక్ లు సిద్ధం చేశారు. ఈ పార్కులపై నగర వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛమైన గాలికి చిరునామాలు..
ఇక నగర వాసులకు వారాంతాల్లో ఉల్లాసాన్ని పంచటంతోపాటు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో ఏర్పాటైనవే ఆక్సిజన్ పార్కులు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డుకి ఐదు కిలోమీటర్ల రేడియస్ లోపల ఈ పార్కులను సిద్ధం చేస్తోంది. మొత్తం 59 పార్కులను హైదరాబాద్ పరిసరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావించిన సర్కారు ఇప్పటికే 32ని సిద్ధం చేసింది. వీటితోపాటు మరో 36 ఫారెస్టు పార్కులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న రద్ధీ దృష్ట్యా గాలి కాలుష్యాన్ని తగ్గించటంతోపాటు... నాశనమవుతున్న అటవీ సంపదను కాపాడటం కూడా ఈ ఆక్సిజన్ పార్కుల ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా కండ్లకోయ సమీపంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్టు పార్కు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయా పార్కుల్లో అనేక రకాల ఔషధ మొక్కలు, వాకింగ్ ట్రాక్‌లు నిర్మాణంతోపాటు..లాంగ్ రైడ్‌కి వచ్చే నగరవాసులు ఒకరోజు మొత్తం ఉండి అహ్లాదంగా గడిపేందుకు కావాల్సిన జిప్ లైన్లు, పిల్లల కోసం ప్రత్యేక క్రీడలు, ప్రకృతి విశిష్టతను తెలిపే చర్యలు చేపట్టారు.
ఆక్రమణలకు చెక్...
ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో పార్కులకు ఆక్రమణల చెర నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ అసెట్స్ ప్రొటెక్షన్ సెల్ క్రమంగా ఒక్కో ఉద్యానవనాన్ని ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇప్పటికే పార్కు స్థలాల్లోని పదుల ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణల గురించి టోల్ ఫ్రీ నంబరు.. 18005990099ను సంప్రదించి వివరాలు ఇవ్వొచ్చు. పని దినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.