నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ ఒకటో తరగతిలో చేరకముందే పిల్లలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువు పూర్తిచేస్తున్నారు. ప్లే స్కూల్, కిండర్ గార్టెన్ తదితర పేర్లతో కేవలం శిశు తరగతుల కోసమే హైదరాబాద్ సహా పలు నగరాల్లో వందల సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
దేశవ్యాప్తంగా కొన్ని పేరున్న యాజమాన్యాలు ఇలాంటివి ప్రారంభించి, ఫ్రాంచైజీలూ ఇస్తున్నాయంటే వీటికున్న గిరాకీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, దిల్లీ వంటి నగరాల్లో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో కిండర్‌గార్డెన్ సీటుకు పోటీ తీవ్రంగానే ఉంటుంది. కొన్నింటిలో సీటు దొరకాలంటే పరపతి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితీ ఉంది. మరికొన్ని యాజమాన్యాలు ముందస్తుగా పరీక్ష నిర్వహించి మరీ ప్రవేశాలు కల్పిస్తున్న దాఖలాలున్నాయి. కరోనా ఈ పరిస్థితిని తలకిందులు చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆరా తీసే వారే కరువయ్యారని కొందరు నిర్వాహకులు చెబుతున్నారు. ‘మా పాఠశాలలో ఏటా 25 మంది నర్సరీలో చేరే వారు. ఈసారి ఒక్కరూ సీటు కావాలని అడగలేదు’ అని జీడిమెట్లలో ఫ్రాంచైజీగా ఓ ప్లేస్కూల్ నడుపుతున్న పాఠశాల భాగస్వామి చెప్పారు.
సీబీఎస్‌ఈలోనూ అదే పరిస్థితి
హైదరాబాద్ నగరంలో చాలా సీబీఎస్‌ఈ పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లోనే కొత్తగా ప్రవేశాలు కల్పిస్తాయి. కొన్ని పాఠశాలల్లో ఈ సీట్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయా పాఠశాలల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర రాష్ట్రేతర బోర్డుల్లో ప్రవేశాలు డిసెంబరు, జనవరిలోపే పూర్తయ్యాయి. ‘అప్పుడు సీట్లు పొందిన వారు మాత్రం ఆ సమయంలో కొంత డొనేషన్, రుసుములు చెల్లించారు. వాళ్లూ ఇప్పుడు బడిలో పిల్లల్ని చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. పాఠశాలలు తెరిస్తే కొద్ది మొత్తంలో ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాం’ అని ఆయా పాఠశాలల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.
టీకా వచ్చే వరకు ఇంతే
ఈ విద్యా సంవత్సరం నర్సరీ, ఎల్‌కేజీ లాంటి శిశు తరగతుల్లో ప్రవేశాలు 70 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. ఉదాహరణకు మా పాఠశాలలోనే నర్సరీలో ఏటా 25 మంది చేరేవాళ్లు. ఇప్పుడు సీటు అడిగిన వారు లేరు. కరోనా టీకా వస్తే తప్ప తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపే ధైర్యం చేయరు.
- ఎస్‌ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ట్రస్మా