- 30 రోజుల ప్రణాళిక గ్రామాలకు ఎలాంటి తోడ్పాటు ఇవ్వనుంది?
పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను గ్రామాల్లో నిరంతరం చేపట్టాల్సిందే. వాటికి ప్రేరణగా నిలిచేదే 30 రోజుల ప్రణాళిక. దీంతో గ్రామాలు శోభాయమానమవుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నారు. మరోవైపు కోతులు ఇష్టపడే నేరేడు, జామ, ఉసిరి వంటి మొక్కలను అటవీ ప్రాంతాల్లో విరివిగా పెంచుతున్నాం. ఈ చర్యతో మరో రెండేళ్లలో గ్రామాల్లో కోతుల సమస్య ఉండనే ఉండదు.
- కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన వాటితోసహా తమకు నిధులను సకాలంలో ఇవ్వడంలేదని సర్పంచులు వాపోతున్నారు. చెక్కులపై సర్పంచి, ఉపసర్పంచి సంయుక్త సంతకాల విధానాన్నీ కొందరు వ్యతిరేకిస్తున్నారు కదా?
కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలిపి ప్రతినెలా రూ.339 కోట్ల చొప్పున పంచాయతీలకు ఇచ్చే విధానాన్ని ఈ నెల నుంచి మొదలుపెట్టాం. ఇక నిధుల సమస్య అనేదే ఉత్పన్నంకాదు. పంచాయతీలు గతంలో తాగునీటికి చేసే ఖర్చంతా మిషన్ భగీరథ వల్ల వాటికి మిగులుతోంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం కాబట్టి ఆ వ్యయమూ ఆదా అవుతుంది. ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునేందుకే ఉమ్మడి సంతకాల విధానాన్ని తీసుకొచ్చాం. సంతకం చేసేందుకు ఎవరైనా ఉప సర్పంచి అంగీకరించకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.
- ఆర్థిక సంఘం నిధులను ఆయా పంచాయతీలకు నేరుగా పంపాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?
కేంద్రం నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేయడం సమంజసంకాదు. కేంద్రం నుంచి ఇప్పటికే అనేక రకాల నిధులు రావాల్సిఉంది. దేశవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ.. అమెరికాలో ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే భగీరథ ద్వారా అలా చేస్తున్నాం కాబట్టి దీనికి ఏటా కావాల్సిన రూ.2,200 కోట్ల నిర్వహణ వ్యయంలో కనీసం సగమైనా కేంద్రం భరించాలి. ఉపాధి హామీ పనుల్లో సామగ్రి ఖర్చుల రూపేణా రూ.650 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
- విద్యుత్ బకాయిలను కట్టలేమని కొన్ని పంచాయతీల వారు వాపోతున్నారు. కార్యాలయాలకు భవనాల సమస్య తీవ్రంగా ఉంది. ఇంకా పలు ఇతర సమస్యలపై మీరేమంటారు?
విద్యుత్ బిల్లుల బకాయిలను కొంత మేర తగ్గించి.. వాటి చెల్లింపునకు ఏకకాల పరిష్కార విధానాన్ని త్వరలో తీసుకొస్తాం. పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అక్కడి జనాభాను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వదలిచాం. ఏకగ్రీవ పంచాయతీలకు త్వరలోనే ప్రోత్సాహక మొత్తాలను అందజేస్తాం. చిన్న పంచాయతీలకు ఒకటి, పెద్ద వాటికి రెండు చొప్పున ట్రాక్టర్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుతాం.
- పరిషత్‌లకూ నిధులు ఇచ్చే యోచన ఏమైనా ఉందా? వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక ఏంటి?
పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకూ నిధులు ఇవ్వాలనుకుంటున్నాం. కొత్త రోడ్లు, ఉన్నవాటికి మరమ్మతులకు రూ.2 వేల కోట్లను ఖర్చుపెట్టాలనే ప్రతిపాదలు పరిశీలనలో ఉన్నాయి.