ఏడాదికి పైగా పాకిస్థాన్ జైల్లో మగ్గిన తెలుగు మత్స్యకారులు భారత్‌లో అడుగుపెట్టారు. 2018లో వేటకు వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్ర జాలర్లను... ఆ దేశ సైన్యం బంధించి జైల్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్చలతో వీరిని ఎట్టకేలకు విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద వీరిని భారత్‌కు అప్పగించింది. పాక్ నుంచి విడుదలైన తెలుగు మత్స్యకారులను తీసుకొచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా సరిహద్దుకు వెళ్లారు. జాలర్లకు మంత్రి సహా అధికారులు మిఠాయిలు తినిపించారు. వారందరినీ రేపు స్వగ్రామాలకు తీసుకువస్తామని మంత్రి మోపిదేవి మీడియాకు తెలిపారు.
ఎలా చిక్కారు?
పొట్టకూటి కోసం గుజరాత్‌కు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు... వీరావల్‌లో చేపలవ్యాపారుల వద్ద పనిచేసేవారు. 2018 నవంబర్‌లో చేపల వేటకు వెళ్లిన 20 మంది పొరపాటున వీరావల్ తీరం నుంచి పాక్ జలాల్లోకి ప్రవేశించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు... అనుకోకుండా పాక్‌కు బందీలుగా మారి అక్కడి లంధి జైలులోశిక్ష అనుభవించారు. 2008 ఒప్పందం ప్రకారం భారత్, పాక్ ఏటా మత్స్యకారులు, ఖైదీలను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈసారి భారత విదేశాంగ చర్చలూ ఫలించటంతో.. లంధి జైలు నుంచి 20 మందిని పాక్ విడుదల చేసింది.
విడుదలైన వారు వీరే
పాక్ విడుదల చేసిన తెలుగువారిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన... ఎస్.కిశోర్, నికరందాస్ ధనరాజ్, గరమత్తి, ఎం.రాంబాబు, ఎస్.అప్పారావు, జీ.రామారావు, బాడి అప్పన్న, ఎం.గురువులు, నక్కా అప్పన్న, నక్కా నర్సింగ్, వి.శామ్యూల్, వి.ఎర్రయ్య, డి.సురాయి నారాయణన్, కందా మణి, కోరాడ వెంకటేశ్, శేరాడ కళ్యాణ్, కేశం రాజు, భైరవుడు, సన్యాసిరావు, సుమంత్ ఉన్నారు.